సమస్య పరిష్కరించకుండానే ఫిర్యాదులు క్లోజ్.. GHMCపై ఫైరవుతున్న జనం

సమస్య పరిష్కరించకుండానే ఫిర్యాదులు క్లోజ్.. GHMCపై ఫైరవుతున్న జనం
  • గ్రీవెన్స్​కు వచ్చిన ఫిర్యాదులు సర్కిల్ అధికారులకు బదిలీ  
  • ఆ పనులు చేయకుండానే చేసినట్లు  ఫిర్యాదుదారులకు మెసేజ్​లు
  • వర్క్స్ ఎక్కడ చేశారో చూపాలని  ఎక్స్​లో ఫిర్యాదుదారుల ప్రశ్నలు

ఓల్డ్ సఫిల్ గూడ పరిధిలోని రోడ్డు నంబర్ 3లో స్ట్రీట్ లైట్ పనిచేయడం లేదని సాయితేజ అనే సిటిజన్ జీహెచ్ఎంసీ గ్రీవెన్స్​కు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడ లైట్ ఏర్పాటు చేయకుండానే చేసినట్లు  జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేశారు. ఇదే విషయంపై ఈనెల 7న సాయితేజ ఎక్స్ వేదికగా స్పందించాడు. అసలు లైట్ ఏర్పాటు చేయకుండానే ఎలా క్లోజ్ చేశారని జీహెచ్ఎంసీని ప్రశ్నించాడు. 

టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి లంగర్​హౌస్ వచ్చే రూట్ లో బాపూఘాట్ వద్ద 30 మీటర్ల మేరా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిందని  రాజు అనే సిటీజన్ గ్రీవెన్స్ సెల్​కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయగానే 2207255375371 కంప్లయింట్ ఐటీ జారీ చేశారు. అలా కొద్ది రోజుల తరువాత వర్క్ చేయకుండానే చేసినట్లు సర్కిల్ అధికారులు కంప్లయింట్ క్లోజ్ చేశారు.   దీనిపై రాజు తిరిగి ఇప్పటికి మూడుసార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ రోడ్డు రిపేర్ చేయలేదు. పైగా ఫిర్యాదు క్లోజ్ చేస్తూనే ఉన్నారు.

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్​కు వస్తున్న ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడంలేదు. ఆయా సమస్యలపై వచ్చిన పనులు చేయకుండానే చేసినట్లు ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్ లైన్ నెంబర్, వెబ్ సైట్, డయల్ 100 ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వెంటనే ఆయా ఫిర్యాదుదారులకు ఆటోమెటిక్​గా ఐడీ క్రియేట్ అవుతుంది. 

ఆ ఐడీ ఆధారంగా సమస్యకి పరిష్కారం లభించిందా?  వర్క్ ప్రాసెస్ ఏ స్టేజ్ లో ఉందన్న వివరాలు తెలుసుకునేందుకు వీలుంది. అయితే ఫిర్యాదులు చేసిన తరువాత రెండు, మూడురోజుల తరువాత ఫిర్యాదులను సర్కిల్ అధికారులు  క్లోజ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఏ సమస్యపైన అయితే ఫిర్యాదులు చేశారో ఆ సమస్యకు పరిష్కారం చూపకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారు. దీంతో ఫిర్యాదు దారులు పరేషాన్ అవుతున్నారు. అధికారులు ఎందుకిలా చేస్తున్నారని ఉన్నతాధికారులను ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. 

ప్రతినెలా 20 వేల కంప్లయింట్స్ 

బల్దియాకు వస్తున్న కంప్లయింట్స్ లో  ఎక్కువగా పార్కులు, రోడ్ల డ్యామేజ్, ఎలక్ట్రికల్,చెత్తకి  సంబంధించిన ఫిర్యాదులను ఇలా  క్లోజ్ చేస్తున్నారు. సిటీలో సమస్యల పరిష్కారం కోసం బల్దియాకు ప్రతినెలా 15 నుంచి 20 వేల కంప్లయింట్స్ వస్తున్నాయి.  ఇందులో దాదాపు 5 వేల వరకు ఫిర్యాదులు పెండింగ్ లో ఉంటున్నట్లు తెలిసింది. 

అయితే ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ విధంగా వర్క్ చేయకుండా క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  సమస్యకి పరిష్కారం  చూపకుండానే ఆ ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారని జనం మండిపడుతున్నారు. దీంతో చేసిన ఫిర్యాదునే మళ్లీ మళ్లీ రీ ఓపెన్  చేస్తున్నారు. 

సిజిజన్ చార్టర్ ప్రకారం పనులు చేయాల్సిందిలా....

సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను సిజిజన్ చార్టర్ ప్రకారం పనులు పూర్తి చేయాల్సి ఉంది.  అందులో చెత్తని తరలించడానికి సంబంధించిన ఫిర్యాదులపై అదేరోజు పరిష్కరించాల్సి ఉంది. పాట్ హోల్స్​ ని పూడ్చేందుకు,  మ్యాన్ హోల్స్ మూతల ఏర్పాటు, రోడ్డు పక్క న ఉన్న సిల్ట్ ని తీసేందుకు, స్ర్టీట్ లైట్ రిపేర్, యాంటి లార్వా ఆపరేషన్, జంతువులు మరణించాయని వచ్చే ఫిర్యాదులపై 24 గంటల్లో పనులు చేయాల్సి ఉంది. 

డ్రైనేజీలు బ్లాక్, సీ అండ్ డీ(భవన నిర్మాణ వ్యర్థాలు) క్లీనింగ్ కోసం అయితే 48 గంటలు, ఫాగింగ్ ఆపరేషన్ అయితే 24 గంటల నుంచి 48 గంటల్లో చేయాల్సి ఉంది. ఫుట్ పాత్ రిపేర్లు అయితే 72గంటలు, పెట్ డాగ్ లైసెన్స్ కోసం వారం, సినీయర్ సిటిజన్, దివ్యాంగుల ఐడీ కార్డులను 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. పబ్లిక్ టాయిలెట్స్​కు సంబంధించి మెయింటెనెన్స్​అయితే  నెలరోజులు, క్లీనింగ్ అయితే అదే రోజు క్లియర్ చేయాల్సి ఉంది.  కానీ ఏ ఒక్కటి సకాలంలో జరగడంలేదు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన టైమ్ లోగా అధికారులు పనులు చేయడంలేదు.  ఈ నేపథ్యంలోనే పనులు చేయకుండా చేసినట్లు క్లోజ్  చేస్తున్నట్లు కనిపిస్తుంది.