4,200కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్.. సొంత పార్టీ, ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవ్వరిని వదల్లే

4,200కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్.. సొంత పార్టీ, ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవ్వరిని వదల్లే
  • హైకోర్టు జడ్జి, ఆయన భార్య ఫోన్లు ట్యాప్‌.. 16 మంది హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్ సిద్ధం​
  • త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రసేనా రెడ్డి, దత్తాత్రేయ ఫోన్లూ ట్యాప్
  • రోజురోజుకు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య.. సిట్ ఆఫీసుకు క్యూ
  • నా ఫోన్ ట్యాప్‌ అయ్యిందా? ఎప్పుడు? ఎలా? అని బాధితుల ప్రశ్నలు
  • 4,200కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ ​అయినట్లు గుర్తింపు​
  • ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి  స్టేట్‌మెంట్ల రికార్డు
  • బెయిల్ రాక 10 నెలలుగా జైలులోనే పోలీస్ అధికారులు
  • ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్‌
  • తెరవెనుక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బీఆర్‌‌ఎస్ సహా అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మావోయిస్టులు, టెర్రరిస్టుల పేరుతో సామాన్యులు మొదలుకొని ప్రతిపక్షాలు, సొంత పార్టీ అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, వారి అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు స్పెషల్​ఇన్వెస్టిగేషన్​ టీమ్​(సిట్​) గుర్తించింది. వీళ్లతో పాటు  కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు, మీడియా సంస్థల చైర్మన్లు, సీఈవోలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, ఆఖరికి జడ్జీలు, వాళ్ల  కుటుంబసభ్యులు, డ్రైవర్లను కూడా వదలకుండా ప్రభాకర్​రావు టీమ్ 4వేలకు పైగా ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్టు తేల్చింది. గత బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావును విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

టెలికాం సంస్థలు ఇచ్చిన ట్యాపింగ్ లిస్టు, నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులు గత సర్కార్ కుట్రలను బయటపెడుతున్నాయి. రోజురోజుకూ బాధితుల లిస్టు పెరిగిపోతుండగా.. జూబ్లీహిల్స్ పీఎస్ ముందు సాక్షులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 257 మంది సాక్షుల స్టేట్‌‌మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. లిస్టులో ఉన్న ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా రాజకీయ, మీడియా ప్రముఖుల స్టేట్‌‌ మెంట్లను సేకరిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా సిట్‌‌ అధికారులు సాక్షులకు నోటీసులు ఇస్తున్నారు. కాగా, వీరిలో చాలామందికి  పోలీసుల నుంచి  కాల్‌‌ వచ్చే వర కు వాళ్ల ఫోన్‌‌ ట్యాప్ అయినట్టు కూడా తెలియదు. రాజకీయాలతో సంబంధం లేని వారికి కూడా సిట్‌‌ నుంచి కాల్స్ వస్తుండడంతో తమ ఫోన్ ​ఎప్పుడు ట్యాప్ ​అయ్యిందోనని విస్మయానికి గురవుతున్నారు.  

2018 ఎన్నికల నుంచే షురూ..

కేసీఆర్‌‌ తనకు రాజకీయంగా‌‌ తిరుగులేకుండా చూసుకునేందుకు 2018 నుంచే ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు పాల్పడినట్లు సిట్‌‌ దర్యాప్తులో తేలింది. మావోయిస్టుల పేరుతో  సొంత పార్టీలో అసంతృప్తులు, రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్‌‌గా గత సర్కార్ ట్యాపింగ్‌‌కు పాల్పడినట్లు సిట్​విచారణ బయటపెట్టింది. ఏకంగా 4,200కుపైగా ఫోన్ల ప్రొఫైళ్లను క్రియేట్‌‌ చేసినట్లు అధికారులు గుర్తించారు.  ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలి జెన్స్ బ్రాంచ్‌‌(ఎస్‌‌ఐబీ) హార్డ్‌‌ డిస్కుల్లో మరో 2 వేల వరకు ఫోన్‌‌ నంబర్లు ఉన్నట్లు తెలిసింది. ఎస్‌‌ఐబీ చీఫ్‌‌గా ఉన్న రిటైర్డ్‌‌ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు పోస్టింగ్‌‌ ఇచ్చిన నాటి నుంచే స్పెషల్ ఆపరేషన్స్‌‌ టార్గెట్‌‌(ఎస్‌‌ఓటీ) బృం దం కాంగ్రెస్, బీజేపీ  కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు, బీఆర్‌‌‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా పనిచేసే గ్రామస్థాయి కార్య కర్తల ఫోన్ నంబర్లను సేకరించింది. 

జీహెచ్‌‌ఎంసీ, మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్‌‌తో పాటు రాష్ట్రంలో జరిగిన అన్ని  ఎన్నికల్లో ప్రత్యర్థులను ప్రభాకర్​రావు టీమ్​ టార్గెట్‌‌ చేసింది. ఇందుకోసం సుప్రీం నుంచి ప్రభాకర్ రావుకు అక్కడి నుంచి తనకు ఆదేశాలు వచ్చేవని విచారణలో ప్రణీత్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్‌‌‌‌ ప్రత్యర్థులతోపాటు వారి కుటుంబీకులు, అనుచరులు, బంధువులు, ఫైనాన్సియల్‌‌గా సపోర్ట్ చేసేవారందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. 

ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ  మాటలూ విన్నారు..!

ప్రస్తుత త్రిపుర గవర్నర్‌‌ ‌‌నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన రెండు ఫోన్‌‌ నంబర్లను కూడా ప్రణీత్‌‌రావు టీమ్ ట్యాప్​ చేసింది. ఇంద్రసేనారెడ్డి తన ఓఎస్డీ నర్సింహులు పేరుతో ఉన్న ఫోన్ నంబర్లు వినియోగించేవాడని తెలి సింది. ఈ మేరకు సిట్‌‌ అధికారులు ఓఎస్డీ స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేశారు. బండారు దత్తాత్రేయ సహా  సీనియర్ నేతల ఫోన్లను కూడా ట్యాప్​ చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించని కొందరు సీనియర్ పోలీస్ అధికారుల ఫోన్లను కూడా  ప్రభాకర్‌‌‌‌ రావు ట్యాప్​చేసినట్లు గుర్తించారు.

 ఈ క్రమంలో కొంత మంది అధికారులను తమకు అనుకూలంగా పనిచేసేలా బెదిరింపులకు పాల్పడినట్లు తాజాగా బయటపడింది. గ్రేటర్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌‌కే చెందిన కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు సందీప్‌‌రావు, బిజినెస్ పార్ట్‌‌నర్ ఫోన్ నంబర్లను ట్యాప్​ చేశారు. ఫోన్ నంబర్ల  ఆధారంగా ఆ ఫోన్లు ఎవరు వాడుతున్నారనే సమాచారం సేకరిస్తున్నారు. ఏ అవసరాల కోసం ఫోన్‌‌‌‌ ట్యాప్​ చేశారన్న కోణంలో  విచారిస్తున్నారు.   

ఎన్నికల సమయంలో ఆపరేషన్స్.. 

ఎస్‌‌ఐబీ లాగర్‌‌ ‌‌రూమ్‌‌ నుంచి డీఎస్పీ ప్రణీత్‌‌రావు అం దించిన ఫోన్‌‌ నంబర్లు, వాయిస్ రికార్డింగ్స్‌‌ ఆధారంగా గత ఎన్నికల  సమయంలో రాధాకిషన్‌‌ రావు టీమ్‌‌ ఆపరే షన్స్ నిర్వహించింది. గ్రేటర్‌‌‌‌ పరిసరాల్లోని నాలుగు జిల్లాల్లో రెయిడ్స్ చేసి ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌‌చార్జీల డబ్బులను పట్టుకున్నారు. వివిధ కంపెనీల జీతభత్యాలు, ఇతర అవసరాల కోసం  తీసుకెళ్తున్న డబ్బులను కూడా సీజ్‌‌ చేశారు. 

ముఖ్యనాయకుల అనుచరులు, ఆర్థిక వ్యవహరాలు చూసే సిబ్బంది.. వివిధ కంపెనీల చీఫ్ ఫైనాన్స్‌‌ ఆఫీసర్లు, అకౌంటెంట్ల ఫోన్లను ట్యాప్‌‌ చేసి వెంబడించారు. పట్టుకున్న డబ్బులో కొంత మాత్రమే లెక్కలు చూపేవారన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా వ్యాపారుల వద్ద సీజ్ చేసిన డబ్బులో తమకు రావాల్సిన వాటాను తీసుకుని కేసులు, ఐటీ ఇబ్బందులు లేకుండా మిగతా సొమ్ము తిరిగి అప్పగించేవారని తెలిసింది. ఇలా మునుగోడు, హుజూరాబాద్‌‌, మెదక్‌‌ ఉప ఎన్నికల సమయంలో మోడల్ కోడ్‌‌ ఆఫ్ కండక్ట్‌‌ అమలులోకి రాకముందే ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఆపరేషన్స్‌‌ చేసిందని సిట్‌‌ ఆధారాలు సేకరించింది.  

కాంగ్రెస్ గెలుపుతో ఆధారాలు ధ్వంసం.. 

2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లో గ్రామస్థాయి లీడర్ల నుంచి సొంత పార్టీల అభ్యర్థులు, ప్రత్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా ఫోన్లను ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌‌ ద్వారా ప్రత్యర్థు ల ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వీల్లేకుండా ఎక్కడిక్కడ డబ్బులు సీజ్ చేశా రు. కాంగ్రెస్ గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావ డంతో ప్రభాకర్ రావు టీమ్‌‌ అప్రమత్తమైంది. నవంబర్‌‌‌‌ 30న ఆపరేషన్‌‌ నిలిపివేసింది. ప్రభుత్వం మారితే ఫోన్‌‌ ట్యాపింగ్‌‌తో పాటు బీఆర్‌‌‌‌ఎస్ అక్రమాలు బయటపడతాయనే భయంతో ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్‌‌ను ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారు. 

డిసెంబర్ 4న ఎన్నికల ఫలి తాలు విడుదల కావడం..కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్‌‌ను ధ్వంసం చేయాలని ప్రణీత్‌‌ రావును ఆదేశించారు. దీంతో ప్రణీత్‌‌రావు టీమ్‌‌ అదే రోజు రాత్రి 7:30 నుంచి 8 :15 మధ్య సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి 50 కంప్యూటర్ల హార్డ్‌‌ డిస్క్‌‌లు, సర్వర్లను మార్చేసింది. వాటి స్థానంలో ఇతర హార్డ్‌‌డిస్క్‌‌లు ఏర్పాటు చేసింది. ఎస్‌‌ఐబీ డేటా ఉన్న50 హార్డ్‌‌డిస్క్‌‌లను ముక్కలు ముక్కలుగా కట్‌‌ చేసి నాగోల్‌‌లోని మూసీ బ్రిడ్జి కింద తగులబెట్టారు.

తప్పని తెలిసీ చిక్కుల్లో పడ్డారు..  

తాము చేస్తున్నది తప్పని తెలిసి కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్‌‌రావు ఫోన్ ట్యాపింగ్‌‌కు పాల్పడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం అందించిన ఫోన్ నంబర్లను ట్యాపింగ్‌‌ చేశారు. బ్లాక్ మెయిలింగ్‌‌, బెదిరింపులతో సెటిల్‌‌మెంట్లు చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో అక్రమాలకు పాల్పడ్డారు. ఆధారాలను మాయం చేసేందుకు 30 ఏండ్లుగా భద్రపరిచిన ఎస్‌‌ఐబీ సీక్రెట్‌‌ డేటాను ధ్వంసం చేశారు. 

కానీ ప్రస్తుతం సిట్‌‌ దర్యాప్తులో తప్పించుకోలేకపోతున్నారు. ఎస్‌‌ఐబీ చీఫ్‌‌గా ఉన్న ప్రభాకర్ రావు, ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌‌రావు సిట్‌‌కు చిక్కకుండా అమెరికాల్లో తలదాచుకున్నా.. వారిని కలుగులోంచి ఎలుకను లాగినట్లుగా అమెరికా నుంచి రప్పించి మరీ చట్టం ముందు సిట్ అధికారులు నిలబెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా సిట్‌‌ విచారణను ఎదుర్కోక తప్పడం లేదు.  

జడ్జీలనూ వదల్లేదు.. 

బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసులను కూడా ప్రభాకర్ రావు టీమ్ మానిటరింగ్ చేసింది. ఒక మహిళా జడ్జితో సహా 16 మంది హైకోర్టు జడ్జీలతో కూడిన ప్రొఫైల్స్‌‌ను సిద్ధం చేసుకుంది. ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్‌‌ చేశారా? లేదంటే వారి ఫోన్‌‌ నంబర్స్ కూడా ట్యాప్‌‌ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. ఇందులో ఓ జడ్జి, ఆయన భార్య ఫోన్‌‌ నంబర్‌‌‌‌ను ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ట్యాప్ చేసినట్లు ఇప్పటికే బయటపడింది. 

వీరిద్దరి ఫోన్‌‌ నంబర్స్‌‌ ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జీల డేటా సేకరించినట్టు గుర్తించారు. ఈ కేసులో 3వ నిందితుడు, ఎస్‌‌ఐబీ పొలిటికల్‌‌ వింగ్‌‌ చీఫ్‌‌గా వ్యవహరించిన మాజీ అడిషనల్‌‌ ఎస్పీ భుజంగరావు లీడర్లు, ప్రముఖుల  డేటా రూపొందించేవాడని.. ఈ క్రమంలోనే హైకోర్టు జడ్జీల వివరాలను ఆన్‌‌లైన్‌‌లో సేకరించినట్లు అనుమానిస్తున్నారు.

వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు

ఎస్‌‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌ రావు పక్కా ప్లాన్ ప్రకారం  మావోయిస్టులు వారి సానుభూతిపరుల పేర్లను ముందుపెట్టి కేసీఆర్ ​రాజకీయ ప్రత్యర్థులు, ఇతరుల ఫోన్​ నంబర్ల ట్యాపింగ్​కు అనుమతి సంపాదించినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీతో పాటు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికమ్యూనికేషన్స్‌‌ (డీఓటీ)ని సైతం ఎస్‌‌ఐబీ బురిడీ కొట్టించినట్టు ఆధారాలు సం పాదించింది. ఈ మేరకు మాజీ సీఎస్ శాంతికుమారి మే నెలలో ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ సైతం ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఫోన్​ ట్యాపింగ్ ​కేసు వెనుక ఉన్న సూత్రధారులను బయటకు రప్పించేందుకు అవసరమైన అన్ని ఆధారాలనూ సిట్​ సేకరిస్తోంది. సాధారణంగా కేసుల తీవ్రతను బట్టి ముఖ్యసాక్షులు, బాధితులు సహా  సగటున 30 మందికి మించి  వాంగ్మూలాలను రికార్డు చేయరు. 

కానీ, ఈ కేసులో మాత్రం అన్ని పార్టీల నేతలతోపాటు, రియల్టర్లు, కార్పొరేట్​ సంస్థల యజమానులు, మీడియాసంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, ఇతర అధికారులతో పాటు ఫోన్‌‌ ట్యాపింగ్ లిస్టులో ఉన్న ప్రతీ ఒక్కరి వాంగ్మూలాన్ని సిట్‌‌ రికార్డు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా నేరతీవ్రతకు అద్దంపట్టేలా అత్యంత పకడ్బందీగా చార్జీషీట్‌‌ దాఖలు చేసేందుకే ఇంత మంది నుంచి సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు సిట్​ అధికారులు చెప్తున్నారు.  ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నందునే నలుగురు పోలీస్ అధికారులకు బెయిల్‌‌ లభించకుండా 10 నెలల పాటు జైలుకే పరిమితం చేశామని, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కోర్టు బోనులో నిలబెట్టేందుకే పెద్దసంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నామని స్పష్టంచేస్తున్నారు.