ప్లేట్లెట్లకు అడ్డగోలుగా మేకల రక్తం... సైంటిఫిక్ పద్ధతిలో తీయని ముఠా

ప్లేట్లెట్లకు అడ్డగోలుగా మేకల రక్తం... సైంటిఫిక్ పద్ధతిలో తీయని ముఠా
  • నాగారంలో ఇద్దరు అరెస్ట్ 
  • 130 ప్యాకెట్ల రక్తం స్వాధీనం

కీసర, వెలుగు: ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం సత్యనారాయణ కాలనీలోని సోను చికెన్ అండ్ మటన్ షాపులో మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారని సమాచారం రావడంతో కీసర పోలీసులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. షాప్ యజమాని సుందర్ సోను, ఉద్యోగి అఖిల్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 130 ప్యాకెట్లు రక్తం స్వాధీనం చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని సీఎన్​కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌‌‌‌ పోర్ట్స్ సంస్థకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి ల్యాబొరేటరీల్లో ప్లేట్ లెట్స్​ తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

రక్తం తీసి.. మేకలను చంపి అమ్ముతున్రు

వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా రక్తం సేకరించడం వల్ల మేకలు ఒక రోజులోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇలా రక్తం తీసిన మేకలను చంపి సోను తన షాపులో మటన్ అమ్ముతున్నట్లు చెప్పారు. జీవాలపై ఇలాంటి క్రూర చర్యలు చట్టవిరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దందాలో మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమ రక్త సేకరణపై ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు. నిందితులను విచారించి జీహెచ్​ఎంసీ అధికారులు, వెటర్నరీ డిపార్ట్​మెంట్​కు అప్పగించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.