డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒకచోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు శుభం కార్డు పడటం లేదు. హైదరాబాద్ లో ఈగల్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర రూ. ఐదు లక్షల విలువజేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రగ్స్ సప్లై చేస్తున్న మైనర్ ను అరెస్ట్ చేశారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుడు ముంబై డ్రగ్ సిండికేటర్లకు డ్రగ్ ట్రాన్స్పోర్టర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆర్థికంగా బలహీనుడైన బాలుడిని వినియోగించుకొని ముంబై ముఠా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు.
10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని మైనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.
NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. పరారీలో ఉన్న ముంబై డ్రగ్ సరఫరాదారుల కోసం గాలింపు చేపట్టింది ఈగల్ టీం.
