ల్యాండ్ మాఫియాపై పోలీసు యాక్షన్..సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్ స్పెషల్ ఆపరేషన్ 

ల్యాండ్ మాఫియాపై పోలీసు యాక్షన్..సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్ స్పెషల్ ఆపరేషన్ 
  • కబ్జాదారులకు చెక్‌‌‌‌ పెట్టేలా చర్యలు
  • ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్న సీపీ 
  • ప్రొసీజర్ ప్రకారం చట్టపరంగా చర్యలు, అరెస్టులు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు:  సిటీలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నది. ఖాళీ స్థలాలు కనిపిస్తే స్థానిక రియల్టర్లు, రౌడీషీటర్లు కబ్జా చేసేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఫేక్‌‌‌‌ రిజిస్ట్రేషన్ పేపర్లు తయారు చేస్తున్నారు. సిటీలో సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలోనే భూముల ధరలు రూ.వందల కోట్లు పలుకుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలనే రాజకీయ పెద్దలు, అనుచరులు, రౌడీషీటర్లు ఆక్రమించేస్తున్నారు. తక్కువ ధరలో కొనుగోలు చేయడమో లేదా ఖాళీ ప్లాట్లను కబ్జా చేయడమో చేస్తున్నారు. అంగబలం, అర్ధబలం లేని యజమానులపై  బెదిరింపులకు పాల్పడుతూ.. భూములను తమ సొంతం చేసుకుంటున్నారు. దీంతో పేదలు, విదేశాల్లో  దేశాల్లో స్థిరపడ్డ ప్లాట్ల ఓనర్లు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు.

ఖాళీగా స్థలం కనిపిస్తే కబ్జా

 ఖాళీగా కనిపించిన స్థలాల్లో ముందుగా చిన్న డేరాలు వేస్తున్నారు. అందులో తమకు తెలిసిన వారిని కాపలాగా  పెడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. కబ్జా చేసిన ప్లాట్‌‌‌‌చుట్టూ క్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారు. ఎవరైనా స్థలం తమదేనని వస్తే ఫేక్ డాక్యుమెంట్లు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సెక్యూరిటీ గార్డులను కూడా పెడుతున్నారు. స్థానిక అధికారుల అండదండలతో విద్యుత్ మీటర్‌‌‌‌‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌, ఇంటి ట్యాక్స్‌‌‌‌కు డాక్యుమెంట్లను తమకు అనుకూలంగా చేయించుకుంటున్నారు. ఇలా సివిల్‌‌‌‌ కేసుకు అవసరమైన డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. కబ్జా చేసిన ప్లాట్లు, ఖాళీ స్థలాలకు అసలైన ఓనర్లం తామేనంటూ   విక్రయిస్తున్నారు.

చెక్‌‌‌‌ పెట్టేలా కార్యాచరణ

ల్యాండ్‌‌‌‌ మాఫియాకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భూ కబ్జాలు, రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌ మోసాలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. స్థానిక డీసీపీలతో పాటు పోలీసులతో దర్యాప్తు చేయిస్తున్నారు. కేసులు తీవ్రమైనవైతే సీపీ అవినాశ్ మహంతినే  పర్యవేక్షిస్తున్నారు.‘స్పెషల్ ఆపరేషన్‌‌‌‌ ప్రొసీజర్’ ప్రకారం.. స్థానిక రెవెన్యూ, సబ్ రిజిస్టార్‌‌‌‌‌‌‌‌ అధికారులతో కలిసి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, డబుల్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌, బెదిరింపులతో అక్రమంగా కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

సీరియస్​గా తీసుకుంటున్నాం

కమిషనరేట్ పరిధిలో భూ వివాదాలు, కబ్జా కేసులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.  పేదలు, అమాయకులు రూ.కోట్లు విలువైన భూములు కోల్పోతున్నారు. ఇలాంటి కేసులను సీరియస్‌‌‌‌గా తీసుకుంటున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా చర్యలు చేపడుతున్నాం. 
– అవినాశ్​మహంతి, పోలీసు కమిషనర్, సైబరాబాద్‌‌‌‌