
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ నగర పోలీస్ విభాగంలో నూతనంగా మహిళా అశ్విక దళాన్ని చేర్చినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పది మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శుక్రవారం గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు.
ఇప్పటివరకు సిటీలో మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, వీఐపీ సెక్యూరిటీ, పెట్రోలింగ్ వంటి విధుల్లో ఉపయోగించామని చెప్పారు. ఇక నుంచి గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని వివరించారు. శిక్షణ పూర్తయిన మహిళా కానిస్టేబుళ్లు ఇప్పటికే విధుల్లో చేరినట్లు తెలిపారు.
డాగ్ స్క్వాడ్‌లోకి 12 శునకాలు..
హైదరాబాద్ డాగ్ స్క్వాడ్ లో ప్రస్తుతం 34 శునకాలు ఉండగా, మరో 12 తీసుకున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్స్ నుంచి వాటిని సేకరించామన్నారు. రెండు నెలలు వయస్సున డాగ్స్‌ను తీసుకుని, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డీసీపీలు రక్షిత కృష్ణమూర్తి, చంద్రమోహన్, ధార కవిత, గిరిరాజు పాల్గొన్నారు.