- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
- హైదరాబాద్ లో 1,995 ప్రైవేట్ స్కూల్స్
- పట్టించుకోని విద్యాశాఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని ప్రైవేటు స్కూల్స్ ఏటా ఫీజుల వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్, స్కూల్ లోని నోటీసు బోర్డుపై పెట్టాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూల్స్ తమ ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో ప్రదర్శించాలని విద్యాశాఖ 2026 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. అధిక ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రైవేటు యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఫీజుల వివరాలు, సౌకర్యాలపై ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టం(ఐఎస్ ఎంఎస్ తెలంగాణ) పోర్టల్లో నమోదు చేయాలని చెప్పగా..నగరంలోని ప్రైవేటు స్కూల్స్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాశాఖ ఆఫీసర్లు కూడా ఈ విషయాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
90 శాతం స్కూల్స్ వినట్లే..
హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,995 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ స్కూల్స్ ఫీజుల వివరాలను విద్యాశాఖకు సమర్పించడం మాత్రమే కాకుండా స్టూడెంట్స్ తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా నోటీసు బోర్డుపై పెట్టాలి. అలాగే, వెబ్సైట్లోనూ ప్రదర్శించాలి. కానీ, దాదాపు 90 శాతం స్కూల్స్ ఈ రూల్స్ పాటించడం లేదు. ట్యూషన్ ఫీజు, ఇతర ఛార్జీలు ఏమైనా వసూలు చేస్తున్నారా? ఏ క్లాస్ లో ఎంత మంది ఉన్నారు? వారికి ఫీజు ఎంత అనే డిటెయిల్స్ చెప్పడం లేదు.
హైదరాబాద్లో పర్యవేక్షణ కరవు..
హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి స్కూల్ ఫీజు వివరాలను పోర్టల్లో నమోదు చేసిందా? నోటీసు బోర్డులో ప్రదర్శిస్తోందా? వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందా? అనే అంశాలపై ఫీల్డ్లెవెల్లో తనిఖీలు జరపాలి. కానీ, అవేమీ కనిపించడం లేదు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్యను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఆన్లైన్లో కంప్లయింట్ చేయండి
రూల్స్పాటించని స్కూల్స్ పై తల్లిదండ్రులు ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంది. www.schooledu.telangana.go v.in.pscms లో ఫోన్ నంబర్ ఎంట్రీ చేసి ఆ తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే కంప్లయింట్చేయాల్సిన అంశాలు అందులో కనిపిస్తాయి. అప్పుడు వాటిపై క్లిక్ చేసి కంప్లయింట్చేయొచ్చు.
