కేపీహెచ్‌బీ–బయోడైవర్సిటీ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి
నెక్లెస్ రోడ్, గచ్చిబౌలి ఐకియా వద్ద మల్టీ లెవల్ పార్కింగ్‌లు.. వాటిలోనే డిపోలు
హైదరాబాద్, వెలుగు: నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి, వేగవంతమైన ఆధునిక రవాణా సౌకర్యం కల్పించేందుకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) ప్రాజెక్టును వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించిన ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డెడ్‌లైన్ విధించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ప్రాజెక్టు స్వరూపం, రూట్ మ్యాప్‌లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
ఐటీ కారిడార్‌కు తొలి ప్రాధాన్యం
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ వరకు పీఆర్‌టీఎస్ లైన్‌ను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు ఈ మార్గం నిర్మించనున్నారు. పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యం కోసం గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించాలని సూచించారు. అందులోనే పీఆర్‌టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని, దీంతో వాహనాలు పార్క్ చేసి నేరుగా పాడ్ ట్యాక్సీల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మెట్రో, బస్సులతో అనుసంధానం
హుస్సేన్‌సాగర్ పరిసరాలకు వచ్చే పర్యాటకులు, ప్రయాణికుల సౌకర్యం కోసం నెక్లెస్ రోడ్‌లోనూ మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించి, అందులో పీఆర్‌టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులతో పీఆర్‌టీఎస్‌ను అనుసంధానించి అంతర్జాతీయ స్థాయి మల్టీమోడల్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పర్యావరణహిత, కాలుష్యరహిత ఆధునిక రవాణా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కోర్ సిటీలో మరో రెండు మార్గాలు
నగరంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కోర్ సిటీలో మరో రెండు పీఆర్‌టీఎస్ మార్గాలు నిర్మించాలని సీఎం సూచించారు. ఎల్బీ స్టేడియం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు ఒక లైన్ ఏర్పాటు చేయనున్నారు. మరో మార్గం అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్ర భారతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేట్ వరకు నిర్మించాలని ఆదేశించారు. ఈ మార్గాలతో నగర నడిబొడ్డున ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
