హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం.. మరో మూడు గంటలు అలర్ట్

హైదరాబాద్ లో  మళ్లీ భారీ వర్షం.. మరో మూడు గంటలు అలర్ట్

హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. సాయంత్రం వరకు ముసురువాన పడింది. అయితే ఇప్పుడు మాత్రం భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి,లింగంపల్లి,  మాదాపూర్,కొండాపూర్, కృష్ణానగర్, ఉప్పల్,అంబర్ పేట, ముషీరాబాద్, అల్వాల్, బేగంపేట, బోయిన్ పల్లి  సహా మరి కొన్ని ప్రాంతాల్లో  భారీ వర్షం కురుస్తోంది.


ఇప్పటికే సిటీకి అతి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు. రోడ్లపై వరద ఆగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటి శివారుప్రాంతాల్లోనూ వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. 

నిన్నటి నుంచి హైదరాబాద్ లో ముసురు పడుతోంది. రాత్రి చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  దీంతో లోతట్టు కాలనీల్లోకి వరద చేరింది. ఇప్పటికే కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతినడంతో..భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది సిటీలో అసిఫ్ నగర్ లో 4.3 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 

భారీ వర్షాలతో హైదరాబాద్ పురానాపూల్ దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ ఒడ్డున  ఉన్న  ఆలయాలు వరదలో మునిగిపోయాయి. దోబీ ఘాట్ ను బంద్ చేశారు. రెండు రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోందన్నారు స్థానికులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అధికారులు