
- అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరు
ఉప్పల్, వెలుగు:రామాంతాపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి కరెంట్‌షాక్‌తో చనిపోయిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఐదు కుటుంబాలకు చెందిన వారు ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకరు తండ్రిని, మరొకరు భర్తను, మరొకరు ఇంటి పెద్దను, మరొకరు సోదరుడిని కోల్పోయి అంతులేని ఆవేదనలో మునిగిపోయారు. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రమే ఉప్పొంగుతోంది. దేవుడి శోభాయాత్రకు వెళ్లి ప్రమాదంలో చనిపోవడంతో ఆ దేవుడికి మనసు లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
లేరా డైమండ్... లే కొడుకా..
చనిపోయిన పింజర్ల కృష్ణ యాదవ్ (22) ఓల్డ్రామంతాపూర్బొడ్రాయి దగ్గర ఉంటాడు. తండ్రి పింజర్ల రఘు యాదవ్ రామంతాపూర్ యాదవ సంఘం అధ్యక్షుడు. కృష్ణ యాదవ్ ఫంక్షన్లకి డెకరేషన్ తో పాటు పాల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇతడిని అందరూ ముద్దుగా డైమండ్ అని పిలుస్తుంటారు. అసలు కృష్ణ యాదవ్ శోభాయాత్రకు వెళ్లలేదు. కార్యక్రమానికి వెళ్లిన తన తండ్రి వర్షం పడుతున్నా రాకపోవడంతో పిలవడానికి వెళ్లాడు. అక్కడ రథాన్ని లోపలకు తరలిస్తుండగా, సాయం చేస్తూ షాక్కొట్టి కన్నుమూశాడు.
తండ్రి కండ్లముందే కొడుకు చనిపోవడంతో రఘుయాదవ్ను ఆపడం ఎవరితరం కాలేదు. ‘లేరా డైమండ్... లే.. కొడుకా.. నీకేమన్నా అయితే నేను బతక కొడుకా’ అంటూ ఆయన రోదించడం కంటతడి పెట్టించింది. ‘నా కోసం రాకపోయినా బాగుండేది కదరా’ అంటూ పెద్దపెట్టున ఏడ్చాడు. కృష్ణ యాదవ్ కు ఇంకా పెండ్లి కాలేదు. ఒక సోదరి ఉంది. రామంతపూర్ లోని నేతాజీ నగర్ శ్మశానవాటికలో సోమవారం రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇది అబద్దం అయితే బాగుండు..
రుద్ర వికాస్ (39) కూడా హబ్సిగూడ రాఘవేంద్ర నగర్ లో ఉంటూ హబ్సిగూడలో హార్డ్ వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు. వ్యాపారంలో పరిచయాలతో శోభాయాత్రకు పిలుపు రావడంతో వెళ్లి మృత్యువాత పడ్డాడు. రుద్ర వికాస్ తల్లిదండ్రులు తమ బిడ్డను చూడడానికి అమెరికా వెళ్లారు. ఇక్కడ కొడుకు మరణించారని ఫోన్‌చేసి చెప్పడంతో వారి హృదయాలు తల్లడిల్లాయి.
ఈ విషయం అబద్దం అయితే బాగుండునని రోదించారు. ‘దేవుడా మాకీ వయస్సుల్లో ఇంత వేదననను మిగిల్చావ్ ఎందుకు ’ అని శోకసంద్రంలో మునిగిపోయారు. వారు అమెరికా నుంచి వచ్చేటప్పటికే ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో గాంధీ హాస్పిటల్ లో డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించాక కామినేని హాస్పిటల్ ఫ్రీజర్ బాక్స్ లో ఉంచారు.
ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్లి...
మరో మృతుడు కాటేపల్లి శ్రీకాంత్ రెడ్డి (42). ఇతడి తండ్రి కాటేపల్లి అంజిరెడ్డి ఉప్పల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గా పని చేశారు. శ్రీకాంత్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు క్యాటరింగ్బిజినెస్చేస్తున్నాడు. ప్రస్తుతం హబ్సిగూడలోని రాఘవేంద్ర నగర్ లో ఉంటున్నా, విదేశాల్లో హోటల్స్బిజినెస్లు ఉన్నాయి. తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటాడు. శోభాయాత్రకు ఫ్రెండ్స్పిలవడంతో వెళ్లి మృత్యువాత పడ్డాడు. శ్రీకాంత్ అంత్యక్రియలు రామంతాపూర్ లో నిర్వహించారు.
శ్రీకాంత్‌రెడ్డి మరణవార్త తెలియడంతో అతడి స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో మృతుడు రాజేందర్ రెడ్డి (50) కూడా హబ్సిగూడ లోని రాఘవేంద్ర నగర్ లో ఉంటున్నాడు. రాజేందర్ రెడ్డి కూడా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. అంత్యక్రియలను రామంతపూర్ లోని స్మశాన వాటికలో పూర్తి చేశారు.
చిట్టబోయిన సురేశ్‌యాదవ్ (34). తండ్రి వెంకటయ్య చేసే పాల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సురేశ్‌యాదవ్ కు రెండేండ్ల కింద సరితతో పెండ్లి కాగా, వీరికి ఐదునెలల కుమార్తె ఉంది. ఆదివారం శోభాయాత్ర మధ్యలో ఇంటికి వచ్చిన సురేశ్10 నిమిషాలు తన కూతురితో ఆడుకున్నాడు. ఇంట్లో వాళ్లకు బాయ్చెప్తూ తొందరగానే వస్తానని వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక చనిపోయాడని సమాచారం రావడంతో అతడి భార్య, తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. సురేశ్భార్య అతడి ఫొటోలను పట్టుకుని రోదించడం, ఐదు నెలల పాప బిక్క చూపులు చూడడం కదిలించింది. సురేశ్‌కు ఒక తమ్ముడు నాగరాజు ఉన్నాడు. సురేశ్అంత్యక్రియలు రామంతపూర్ లోని నేతాజీ నగర్ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం పూర్తి చేశారు.
పరామర్శించిన కాంగ్రెస్ లీడర్లు
కాంగ్రెస్ లీడర్లు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ ఇన్చార్జ్ వజ్రేష్‌యాదవ్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.