ప్రజాపాలన దరఖాస్తుల్లో హైదరాబాద్, రంగారెడ్డి టాప్

ప్రజాపాలన దరఖాస్తుల్లో హైదరాబాద్, రంగారెడ్డి టాప్

    ఈ రెండు జిల్లాల నుంచే అత్యధికంగా 23 లక్షల దరఖాస్తులు  
    నేడు ప్రజాపాలన వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 
    అందులోనే దరఖాస్తుల స్టేటస్ తెలుసుకునేలా ఆప్షన్ 
    అప్లికేషన్ల ఎంట్రీ.. ఇతర అంశాలపైనా సీఎం రివ్యూ  

హైదరాబాద్, వెలుగు :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన గ్రామసభల్లో స్వీకరించిన అభయ హస్తం దరఖాస్తుల్లో హైదరాబాద్ టాప్​లో ఉన్నది. ఆ తరువాత స్థానంలో రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అప్లికేషన్లు వచ్చిన జిల్లాల్లో ములుగు మొదటి స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి రెండో స్థానంలో ఉన్నాయి. ప్రజాపాలనలో మొత్తం1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డులు, ఇతర సమస్యల మీద వచ్చిన అభ్యర్థనలు19.92 లక్షలు ఉన్నాయి. 

గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, వెబ్ సైట్ లోకి ఎంట్రీ, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతి కుమారితోపాటు వివిధ శాఖల స్పెషల్ సీఎస్ లు, సెక్రటరీలు, ఉమ్మడి పది జిల్లాల నోడల్ ఆఫీసర్లు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

ప్రజాపాలనకు ప్రత్యేక వెబ్ సైట్.. 

ప్రజా పాలన కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్(prajapalana.telangaana.gov.in)ను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఇందులోకి ఎంట్రీ చేస్తున్నారు. అధికారులు డిపార్ట్ మెంట్ ఐడీ ద్వారా లాగిన్ అయి దరఖాస్తులను పరిశీలిస్తారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుల సెల్ ఫోన్లకు మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ లో యూనిక్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. 

ఆ నెంబర్ ఆధారంగా వెబ్ సైట్ లో దరఖాస్తు స్టేటస్ ను తెలుసుకునేలా ఆప్షన్ ఇవ్వనున్నారు. కాగా, ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలోని16,392 గ్రామ పంచాయతీలు, 3,714 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. మొత్తం 3,714 అధికార బృందాలు దరఖాస్తులు స్వీకరించాయి.