
రెండు మూడు రోజులుగా పొట్టు పొట్టు కొట్టిన వాన.. మంగళవారం (సెప్టెంబర్ 23) హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం కల్పించినట్లే అనిపించింది. ఉదయం నుంచి వర్షం లేనప్పటికీ.. సాయంత్రం అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. అయితే రాత్రి అయ్యే సరికి మళ్లీ పాత కథే అన్నట్లు వర్షం స్టార్ట్ అయ్యింది.
హైదరాబాద్ లో మంగళవారం రాత్రి మళ్లీ వర్షం మొదలైంది. నైట్ షిఫ్టులు పూర్తి చేసుకుని నగరవాసులు ఇళ్లకు చేరే వేళ వర్షం స్టార్ట్ అయ్యింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం వాన బీభత్సంతో బతుకమ్మ సంబరాలు ఆపేశారు.
చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో చిరుజల్లు కురుస్తున్నాయి.
►ALSO READ | సెప్టెంబర్26న ప్రారంభం కోసం బతుకమ్మకుంట సర్వం సిద్ధం.. హైడ్రా కమిషనర్ బోటు షికారు
మరో రెండు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురుస్తుందని సూచించారు అధికారులు. నగరవాసులు వీలైనంత తొందరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.