
బషీర్బాగ్, వెలుగు: ఇల్లును అద్దెకు తీసుకుంటామని నమ్మించిన స్కామర్స్నగరానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.12.75 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ లో నివసించే 28 ఏళ్ల వ్యక్తి తన ఫ్లాట్ ను రెంట్ కు ఇస్తానని మ్యాజిక్ బ్రిక్స్ సైట్ లో పోస్ట్ చేశాడు. అది చూసిన స్కామర్వెస్ట్ బెంగాల్ నుంచి ఎన్ఎస్జీ కమాండో ఆశిష్ కుమార్ ప్రహరీ పేరుతో పరిచయం చేసుకున్నాడు. త్వరలో తాను హైదరాబాద్ కు బదిలీ అవుతున్నట్లు తెలిపాడు.
నమ్మకం కలిగించేందుకు నకిలీ గుర్తింపు కార్డును పంపించి, ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంటానని తెలిపాడు. కాసేపటికి ఎన్ఎస్జీ సీనియర్ అధికారి అంటూ రాజేందర్ షెకావత్ పేరుతో కాల్ వచ్చింది. పుల్వామా దాడి తర్వాత ప్రత్యేక భద్రత ప్రొటోకాల్ ను అనుసరిస్తున్నామని, బాధితుడి యూపీఐ, ఐఎంపీఎస్ నుంచి ముందస్తు చెల్లింపులు చేయాలన్నాడు. ఆ డబ్బులను తిరిగి అద్దె డబ్బులతో కలిపి చెల్లిస్తామని నమ్మబలికారు. అతను నిజమేనని నమ్మి పలు దఫాలుగా రూ.12,75,711 బదిలీ చేశాడు. ఇంకా డబ్బులు చెల్లించాలని స్కామర్స్ ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్1930 కు కాల్ చేసి, ఫిర్యాదు చేశాడు.