హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వాటర్​బోర్డు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సింగూరు ఫేజ్–3కి సంబంధించి పఠాన్ చెరులోని ఇక్రిశాట్ వ‌ద్ద రిపేర్లలో భాగంగా 24 గంటల పాటు నీటి సరఫరా జరగదని వెల్లడించారు. వాటర్​బోర్డు 9, 15, 24 డివిజ‌న్ల ప‌రిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, చందాన‌గ‌ర్, పాపిరెడ్డి కాల‌నీ, రాజీవ్ గృహ‌క‌ల్ప, న‌ల్లగండ్ల, హుడా కాల‌నీ, గోప‌న్‌ప‌ల్లి, లింగంపల్లి, గుల్‌మ‌హ‌ర్ పార్కు, నెహ్రూన‌గ‌ర్, గోపిన‌గ‌ర్, దూబే కాల‌నీల్లో 24 గంటల పాటు నీటి స‌ర‌ఫ‌రా ఉండ‌దు. గోపాల్ న‌గ‌ర్, మ‌యూరీ న‌గ‌ర్, మాదాపూర్, ఎస్ఎంఆర్, గోకుల్ ప్లాట్స్, మ‌లేషియా టౌన్‌షిప్, బోర‌బండ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాల్లో లో ప్రెష‌ర్‌తో నీటి జ‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది.

ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​కు శంకుస్థాపన

ఖైరతాబాద్, వెలుగు: బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో రూ.6 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు అంతస్థుల్లో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తయ్యేలా స్థానికులు సహకరించాలని కోరారు. గ్రౌండ్​ఫ్లోర్​లో ఓపెన్​ పార్కింగ్​తోపాటు కమర్షియల్​గా ఉపయోగపడేలా షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షాపుల నుంచి వచ్చే అద్దెను కాంప్లెక్స్​నిర్వహణకు ఖర్చు చేస్తామని, మొత్తం 8 ఆటలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. పూర్తయ్యాక సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఈ  విజయకుమార్, ఏఎంహెచ్ఓ భార్గవ్ నారాయణ పాల్గొన్నారు.

రూ.5 భోజన క్యాంటీన్​లో పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్

ఖైరతాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీస్ ఆవరణలోని రూ.5 భోజన క్యాంటీన్​లో పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ ​జోన్ టాస్క్​ఫోర్స్​పోలీసులు అరెస్ట్​చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసు ఆవరణలోని రూ.5 భోజన క్యాంటీన్​ కేంద్రంగా కొందరు నెలరోజులుగా పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ పోలీసులతో కలిసి శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. 8 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోవట్లే

ఖైరతాబాద్, వెలుగు: దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ హక్కుల సాధన కోసం దివ్యాంగులు రాజకీయంగా ఎదగాలని రాష్ట్రీయ వికలాంగుల పార్టీ అధ్యక్షుడు ఇసాక్ అలీ చెప్పారు. ఆదివారం సోమాజిగూడ  ప్రెస్​ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులకు రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కనీసం బ్యాక్ లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. జీవో నంబర్30 ప్రకారం ప్రతి ఆఫీసులో ర్యాంపులు పెట్టించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. 

మూసివేతలు ఆపి నియామకాలు చేపట్టాలె

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను మూసేయడం ఆపి, వెంటనే నియామకాలు చేపట్టాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.    ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు, ప్రభుత్వ,  ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఓటర్ ఎన్​రోల్​మెంట్ గడువును నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు పొడిగించాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల శ్రమ దోపిడీని నియంత్రించి, అధిక ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవాలన్నారు. అనంతరం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి,  మహబూబ్​నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా టీఎల్ఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణయ్య ను బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. 

కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి

చేవెళ్ల, వెలుగు: స్తంభం ఎక్కి రిపేర్ చేస్తుండగా కరెంట్​షాక్​కొట్టి ఓ ఎలక్ట్రీషియన్​మృతి చెందాడు. ఎస్సై హయ్యూం తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని తలారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(53) ఎలక్ట్రీషియన్. రోజూ మాదిరిగానే ఆదివారం పనిమీద పక్క గ్రామమైన వెంకన్నగూడ వెళ్లాడు. కరెంట్​సప్లై ఆఫ్​చేసి కొండమోళ్ల రాంరెడ్డి అనే రైతు పొలం వద్ద ఉన్న స్తంభం ఎక్కాడు. రిపేర్​చేస్తుండగా షాక్​తగిలి కిందపడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

ఖైరతాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైర్డ్​ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్​పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిన్నింటి కనకరాజు(62) ఏపీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన అమీర్​పేట్ లోని ఆనంద నిలయంలో ఉంటున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో కనకదుర్గ ఆలయం నుంచి కాలినడకన ఇంటికి వెళుతున్న కనకరాజును సికింద్రాబాద్ - లింగంపల్లి రూట్ కు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ11 Z 6448) ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రఘురాం నిర్లక్ష్యంగా బస్సు నడపడం మూలంగానే తన తండ్రి చనిపోయారని ఆరోపిస్తూ కనకరాజు కూతురు పిన్నింటి మయూరి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్క్రాప్​ గోదాంలో మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్​పోర్టు పీఎస్​పరిదిలోని హైమద్​నగర్​లో గౌస్​అనే వ్యక్తికి ఖాళీ స్థలం ఉంది. అందులో చుట్టూ రేకులు వేసి మధ్యలో స్క్రాప్ స్టోర్​చేస్తున్నాడు. ఆదివారం కొంత మంది పిల్లలు పటాకులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి ఎగిరి గోదాంలో పడింది. కొద్దిసేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భయపడిపోయిన స్థానికులు ఫైర్​స్టేషన్​కు కాల్​చేశారు. ఫైర్​ సిబ్బంది వచ్చి రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇయ్యాల్టి నుంచి కంటోన్మెంట్​లో ఇంటింటి సర్వే

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​కంటోన్మెంట్​లో సోమవారం నుంచి ప్రాపర్టీ టాక్స్ ​వివరాల సేకరణకు ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. సేకరించిన వివరాలను ఏ రోజుకారోజు ప్రత్యేక యాప్​లో అప్​లోడ్​చేయనున్నారు. సర్వేను ఆరు వారాల్లో పూర్తిచేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. సర్వేలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ బిల్డింగ్స్, వాటి స్ట్రక్చర్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండికేషన్ నంబర్స్(పీటీఐఎన్), ఇంటి పాత నంబర్లు సేకరిస్తున్నట్లు చెప్పారు. పూర్తయ్యాక వివరాలను వాటర్​బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు,హెల్త్, శానిటేషన్​విభాగాలకు అనుసంధానం చేస్తారు. దీంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెపుతున్నారు.

ఓయూ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ ఉద్యమకారులకు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీని ఓయూ లా డిపార్ట్ మెంట్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కోరారు. ఆదివారం భారత్ జోడో యాత్ర లో భాగంగా షాద్ నగర్ లో  రాహుల్ మేధావులు, ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్​లో గాలి వినోద్ కుమార్ రాహుల్ తో మాట్లాడారు. గత ఎన్నికల్లో విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు, మేధావులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరికి న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గిరిజనులు, ఆదీవాసీలు, దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ ద్వారా అవకాశాలు పొందాయన్నారు. సివిల్ సొసైటీలోని మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ను బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.

పెరికలు ఐక్యంగా ఉండాలి

ఖైరతాబాద్, వెలుగు: పెరికలు ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను పొందాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో గ్రేటర్ హైదరాబాద్ పెరిక(పురగిరి క్షత్రియ) కుల సంఘం హైదరాబాద్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. ఇటీవల పోలీస్​ఉద్యోగం కోసం అభ్యర్థులకు శిక్షణ ఇప్పించడం, అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించేందుకు సంఘం దోహదపడటం అభినందనీయమన్నారు. పెరికలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. నిధులు, సంక్షేమ పథకాలు అందేలా తన వంతు సహకారం అందిస్తానన్నారు. నూతన కార్యవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తిని పరమేశ్, బిల్ల శ్రీకర్, గౌరవ అధ్యక్షుడు దొంగరి మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి శంకర్, ఆర్థిక కార్యదర్శి పిట్టల శేషయ్య, తెలంగాణ పెరిక కుల సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మద్దా లింగయ్య పాల్గొన్నారు.

సాగర తీరాన ఛట్​ పూజలు

సిటీలో ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు ఆదివారం ఛట్ పూజలు వైభవంగా నిర్వహించారు.కుటుంబ సమేతంగా హుస్సేన్​సాగర్​ చేరుకుని సూర్యుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్ సోమేశ్‌ కుమార్, ఈసీ సీఈవో వికాస్ రాజ్, మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, ఏసీబీ డీజీ అంజనీ కుమార్‌‌ పూజల్లో పాల్గొన్నారు. వేడుకలకు సిటీలోని 60 చోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.