
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. భక్తుల రద్దీని బట్టి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజ్‌దూత్ లేన్ గుండా బడా గణేశ్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ ద్వారా ఐమాక్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెక్రటేరియెట్ టెంపుల్ ఎక్స్ రోడ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ గుండా రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ స్థలాలు
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వారు రేస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, హెచ్ఎండీఏ పార్కింగ్ (ఐమాక్స్ పక్కన), ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వారు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి.