ష్... సైలెంట్గా వెళ్లండి... సైరన్ , మల్టీ టోన్డ్ హారన్లపై ట్రాఫిక్ పోలీసుల నజర్

ష్... సైలెంట్గా వెళ్లండి... సైరన్ , మల్టీ టోన్డ్ హారన్లపై ట్రాఫిక్ పోలీసుల నజర్
  • కట్టడి కోసం స్పెషల్​ డ్రైవ్​..  

హైదరాబాద్​ సిటీ, వెలుగు: తెల్ల రంగు కారు ఉంది కదా అని తెల్ల చొక్కా వేసుకొని సైరెన్​ వేస్కొని రోడ్ల మీదికి వస్తే ఇక కుదరదు. మల్టీ టోన్లు, భయంగొల్పే సౌండ్లతో హారన్​ మోగిస్తూ రోడ్లపై హంగామా చేస్తామంటే నడవదు. రోడ్లపైకి వచ్చామా? సైలెంట్​గా వెళ్లామా? అన్నట్టే ఉండాలి. కాదూ కూడదు అంటే సిటీ ట్రాఫిక్​ పోలీసులు చర్యలకు సిద్ధం అయ్యారు. పౌరులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్  రూల్స్​పై అవగాహనలో భాగంగా సైరన్లు, మల్టీ-టోన్డ్/మ్యూజికల్ హారన్ల వినియోగంపై పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ కొనసాగిస్తున్నారు. 

వీటిపై నిషేధం ఉన్నప్పటికీ, చాలా మంది వాహనదారులు వినియోగిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకే ఈ హారన్ల కట్టడికి ట్రాఫిక్​ పోలీసులు పది రోజుల పాటు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. సైరన్లు వాడినందుకు 590 కేసులు, మల్టీ -టోన్డ్/మ్యూజికల్ హారన్లు వాడినందుకు 397 కేసులు  బుక్​ చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ఇకముందు కూడా కొనసాగనుందని ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. మల్టీ-టోన్డ్  మ్యూజికల్ హారన్లను స్వచ్ఛందంగా తొలగించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించారు.