
- ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
- రాత్రి భోజనం చేసి పడుకుని.. తెల్లారేసరికి విగతజీవులుగా
- మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, రెండో బిడ్డ, అల్లుడు, మనమడు
- హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘటన
- బుధవారం రాత్రి దోసెలు, పొంగనాలు, పెరుగన్నం తిన్నరు
- విష ప్రభావంతోనే చనిపోయినట్టు పోస్టుమార్టంలో వెల్లడి
- ఫుడ్‌లో పాయిజన్ కలుపుకొని తిన్నారా? లేక ఎవరైనా కలిపారా? అని అనుమానాలు
- ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్ల గుర్తింపు
మియాపూర్, వెలుగు: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం రాత్రి భోజనం చేసిన పడుకున్న వాళ్లు.. తెల్లారేసరికి విగతజీవులై కనిపించారు. కర్నాటకలోని గుల్బర్గా జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మయ్య (61), వెంకటమ్మ (55) దంపతులు. వీళ్లకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. వీళ్ల కుటుంబం గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నది. లక్ష్మయ్య పెద్ద బిడ్డ లక్ష్మి పదేండ్ల కింద చాంద్‌పాషా అనే వ్యక్తిని ప్రేమించి పెండ్లి చేసుకున్నది. వాళ్లు బాచుపల్లిలోని సాయికృష్ణ హిల్స్‌కాలనీలో ఉంటున్నారు. రెండో బిడ్డ కవిత(24)కు మూడేండ్ల కింద కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన అనిల్(32)తో పెండ్లయ్యింది. వీరికి కొడుకు యువాన్ష్(2) ఉన్నాడు. మూడో బిడ్డ నవితకు హైదరాబాద్ లింగంపల్లిలో ఉండే దుర్గాప్రసాద్‌తో ఏడాది కింద వివాహం జరిగింది. ఇక కొడుకు భగవంత్సాగర్ఆటో నడుపుతుంటాడు. గతంలో బాచుపల్లిలోని వికాస్స్కూల్లో లక్ష్మయ్య వాచ్‌మెన్‌గా, వెంకటమ్మ అటెండర్‌గా పనిచేస్తూ అక్కడే ఉండేవారు. రెండేండ్ల కింద మియాపూర్ మక్త మహబూబ్‌పేట్‌లోని అద్దె ఇంట్లోకి వచ్చారు. అప్పటి నుంచి లక్ష్మయ్య మేస్ర్తీ పని చేస్తుండగా, వెంకటమ్మ స్కూల్‌లో అటెండర్‌గా పని చేస్తున్నది. లక్ష్మయ్యకాలికి గాయం కావడంతో కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు.
10 రోజుల కింద వచ్చిన రెండో బిడ్డ, అల్లుడు..
పెండ్లయిన తర్వాత లక్ష్మయ్య రెండో బిడ్డ కవిత, అల్లుడు అనిల్ హైదరాబాద్ కాళీమందిర్‌లో ఉండేవారు. అనిల్ మేస్ర్తీ పని చేస్తుండేవాడు. కవిత భర్త వెంట కూలీ పనికి వెళ్తుండేది. తర్వాత అజీజ్‌నగర్‌కు షిఫ్ట్ అయ్యారు. కవిత 10 రోజుల కింద తన భర్త అనిల్, కొడుకు యువాన్ష్తో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. బుధవారం రాత్రి 7 గంటలకు బాచుపల్లిలో ఉండే పెద్ద బిడ్డ లక్ష్మి, అల్లుడు చాంద్‌పాషా గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి తెచ్చి ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో అందరూ గుంత పొంగనాలు వేసుకుని తిన్నారు. రాత్రి 10:30 గంటలకు వెంకటమ్మ నీరసంగా ఉందని, కండ్లు తిరుగుతున్నాయని పెద్ద బిడ్డ లక్ష్మికి ఫోన్‌చేసి చెప్పింది. దీంతో లక్ష్మి తన భర్త చాంద్‌పాషాతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వారితో మాట్లాడి 11 గంటలకు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయింది. వెంకటమ్మతో కలిసి స్కూల్‌లో అటెండర్‌గా పనిచేసే తోటి కార్మికులు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంటి తలుపులు కొట్టగా స్పందించలేదు. తర్వాత కొద్దిసేపటికి మరోసారి పక్కనుండే వాళ్లు తలుపులు కొట్టినా ఉలుకుపలుకు లేకపోవడంతో పెద్ద బిడ్డ లక్ష్మికి సమాచారం ఇచ్చారు. ఆమె హుటాహుటిన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది. అప్పటికే లక్ష్మయ్య, వెంకటమ్మ, కవిత, ఆమె భర్త అనిల్, కొడుకు యువాన్ష్విగతజీవులై పడి ఉన్నారు. అందరూ కింద పడిపోయి వాంతులు చేసుకున్నట్టు గుర్తించారు. మియాపూర్పోలీసులు క్లూస్‌టీమ్‌తో స్పాట్‌కు చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మియాపూర్ఇన్స్పెక్టర్శివ ప్రసాద్ తెలిపారు. ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్లు దొరికాయని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని మియాపూర్ఏసీపీ శ్రీనివాస్పరిశీలించారు.
అద్దె ఇంట్లోకి వెళ్లాల్సిన రోజే..
ప్రతిరోజు రాత్రి లక్ష్మయ్య, వెంకటమ్మ దంపతులు తొందరగా తిని పడుకొని.. ఉదయం 4 గంటలకే నిద్రలేచి పనులకు వెళ్తారని స్థానికులు చెప్పారు. అందరితో కలిసిమెలిసి ఉండేవారని తెలిపారు. 10 రోజుల క్రితమే రెండో బిడ్డ కవిత, అనిల్దంపతులు తమ కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. అనిల్ఆటో డ్రైవింగ్చేసుకుంటూ ఇక్కడే ఉండేందుకు స్థానికంగా ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఉదయమే అద్దె ఇంట్లోకి వెళ్లాల్సి ఉండగా అందరూ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
వైజాగ్ వెళ్లిన కొడుకు..
లక్ష్మయ్య కొడుకు భగవంత్సాగర్ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. వైజాగ్‌లో ఫ్రెండ్ రిసెప్షన్ఉండడంతో ఈ నెల 18న స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, అక్క, బావ, అల్లుడు అందరూ మృతి చెందడంతో భగవంత్హుటాహుటిన హైదరాబాద్తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక్కడే ఉంటే భగవంత్కూడా చనిపోయేవాడని స్థానికులు అంటున్నారు.
హత్యా? ఆత్మహత్యా?
ఐదుగురి మృతదేహాలకు గాంధీ దవాఖానలో గురువారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. విష ప్రభావం వల్లే వాళ్లు చనిపోయినట్టు ఫోరెన్సిక్డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా సొంతూరికి తరలించారు. విష ప్రభావమే చావులకు కారణమని తెలియడంతో ఫుడ్‌లో పాయిజన్కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా విషం కలిపి చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుంత పొంగనాల పిండి ఇచ్చేందుకు భర్తతో కలిసి పెద్ద బిడ్డ లక్ష్మీ వచ్చి వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే విషయాలపై ఆరా తీస్తుకున్నారు.
ల్యాబ్‌కు ఆహార పదార్థాలు..
బుధవారం రాత్రి అందరూ కలిసి దోసెలు, గుంత పొంగనాలు, పెరుగు అన్నం తిన్నట్టు తెలిసింది. పెద్ద బిడ్డ, అల్లుడు రాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి కొద్దిసేపు అక్కడే ఉన్నారని తెలిసింది. గుంత పొంగనాల పిండి కూడా వాళ్లే తెచ్చినట్టు తెలుస్తున్నది. తల్లి తనకు కండ్లు తిరుగుతున్నాయని చెప్పగా పెద్ద బిడ్డ, అల్లుడు మళ్లీ వచ్చి చూసి వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత కుటుంసభ్యులు అందరూ భోజనం చేశారా? లేక వాళ్లు రాకముందే భోజనం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. పెరుగన్నంలో ఏదో పొడి కలుపుకొని తినడం వల్లే చనిపోయారని కొందరు అంటున్నారు. పోలీసులు పెరుగన్నం, కూర, సాంబారు, దోసెల పిండిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.