V6 News

సిరాజ్‌‌.. సూపర్‌‌.. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ జైత్రయాత్ర

సిరాజ్‌‌.. సూపర్‌‌.. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ జైత్రయాత్ర

పుణె: సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలింగ్‌‌లో మహ్మద్‌‌ సిరాజ్‌‌ (3/21), బ్యాటింగ్‌‌లో తన్మయ్‌‌ అగర్వాల్‌‌ (40 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 75), అమన్‌‌ రావు (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 52 నాటౌట్‌‌) దుమ్మురేపడంతో.. శుక్రవారం జరిగిన సూపర్‌‌ లీగ్‌‌ గ్రూప్‌‌–ఎ తొలి మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ 9 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. 

టాస్‌‌ ఓడిన ముంబై 18.5 ఓవర్లలో 131 రన్స్‌‌కే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌‌ (29), హార్దిక్‌‌ టమోరే (29), సూర్యాన్ష్‌‌ షెడ్జే (28) మోస్తరుగా ఆడారు. కెప్టెన్‌‌ అజింక్యా రహానే (13), సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ (5), అంగ్‌‌క్రిష్‌‌ రఘువంశీ (4), అథర్వ (3), సాయిరాజ్‌‌ పాటిల్‌‌ (12 నాటౌట్‌‌), శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (0), తనుష్‌‌ కొటియాన్‌‌ (2), తుషార్‌‌ దేశ్‌‌పాండే (1) ఫెయిలయ్యారు. మిలింద్‌‌, తనయ్‌‌ త్యాగరాజన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

తర్వాత హైదరాబాద్‌‌ 11.5 ఓవర్లలో 132/1 స్కోరు చేసి నెగ్గింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు తన్మయ్‌‌, అమన్‌‌ రావు తొలి వికెట్‌‌కు 68 బాల్స్‌‌లోనే 127 రన్స్‌‌ జోడించారు. తన్మయ్‌‌ ఔటైనా, ప్రజ్ఞయ్‌‌ రెడ్డి (1 నాటౌట్‌‌)తో కలిసి అమన్‌‌ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. తుషార్‌‌ ఒక్క వికెట్‌‌ తీశాడు. సిరాజ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌.. రాజస్తాన్‌‌తో తలపడుతుంది.