
ప్రయారిటీ ఇవ్వలేదన్న అసంతృప్తి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు సైలెంట్‌గా ఉండటంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడి 16 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో ఇబ్బందితో ఉన్నారని, అందులో చాలా మంది పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని నేతలు చెప్తున్నారు. కొందరు అసంతృప్తితో అలకబూనితే, మరికొందరు పార్టీ పెద్దలపై కోపంగా ఉన్నారని అంటున్నారు. మూడ్రోజుల కింద మెట్రో రైల్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రేటర్ నేతలతో సీఎం కేసీఆర్ ఫోటో దిగినా అది అక్కడికే పరిమితమైందని, అసంతృప్తి మాత్రం రగులుతూనే ఉందని చెప్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీరే దీనికి కారణమని.. ఆయన కొందరినే ఎంకరేజ్ చేస్తూ, సీనియర్లను పక్కన పెట్టారని అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు ఇంకా ఏడాదే టైముందని, ఇలాంటి సమయంలో అందర్నీ కలుపుకొని వెళ్లాల్సి ఉందని గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ లీడర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక్కరికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చినంత మాత్రన.. గ్రేటర్ పార్టీలోని నేతలంతా సంతోషంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
కనిపించని నాయిని
ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి పార్టీలో సరైన ప్రయారిటీ లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. కేబినెట్లోకి తీసుకోలేదని, కీలక కార్పొరేషన్ పదవి అయినా ఇవ్వలేదన్న ఆవేదనలో నాయిని ఉన్నట్టు చెప్తున్నారు. మరో రెండు నెలల్లో నాయిని ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుండటంతో రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చాన్స్ ఇస్తారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో నాయిని కనిపించకపోవడం వెనుక అసంతృప్తిగా ఉండటమే కారణమని అంటున్నారు.
తగిన పదవి ఇవ్వలేదని..
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో పార్టీని బతికించేందుకు కష్టపడిన పద్మారావుకు సరైన ప్రాధాన్యత దక్కలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తొలి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినా.. ఈసారి డిప్యూటీ స్పీకర్ కు పరిమితం చేయడం అవమానకరమని పేర్కొంటున్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టినప్పట్నించీ పద్మారావుగౌడ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నిజానికి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నేత పార్టీ ప్రోగ్రాంకు అటెండ్ కావచ్చు. కానీ పజ్జన్న మాత్రం రాజ్యంగ పదవి అనే సాకుతో ఎక్కడికి రావడం లేదు’’ అని ఓ నేత అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామ్యం కాలేదని పేర్కొన్నారు.
గుర్రుగా ఉన్న మైనంపల్లి
కేబినెట్లో చాన్స్ ఇవ్వకపోవడంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చాలా కాలంగా పార్టీ పెద్దలపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు. తనకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల ముందు వచ్చిన మల్లారెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడంపై మైనంపల్లి ఇప్పటికీ కోపంగా ఉన్నారని చెప్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలకు శివారు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కానీ మైనంపల్లికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అయినా ఆయన తనకు సన్నిహితంగా ఉండే నేతల విజయం కోసం కొన్ని చోట్ల ప్రచారం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్య అల్వాల్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ను కలిసేందుకు కూడా మైనంపల్లి ఇష్టపడలేదని చెప్తున్నాయి.
అసంతృప్తిలో అరెకపూడి గాంధీ
మంత్రి పదవి వస్తదన్న నమ్మకంలో ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపుడి గాంధీకి పార్టీ పెద్దలు చాన్స్ ఇవ్వలేదు. అసెంబ్లీ విప్ పదవికి పరిమితం చేశారు. గాంధీ ఆ పదవి వద్దంటూ మొండికేసి ఐదారు నెలల పాటు బాధ్యతలు కూడా తీసుకోలేదు. చివరికి బాధ్యతలు చేపట్టినా పార్టీ పెద్దలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.
అప్పుడప్పుడే కనబడ్తున్న దానం
అసెంబ్లీ ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అసంతృప్తి తో ఉన్నారనే చర్చ ఉంది. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారనే భయంతోనే దానం పార్టీ మారారని, ఆయనకు పార్టీ నుంచి హామీ ఏదీ లేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఉంది. కాంగ్రెస్ లో నగరాన్ని శాసించిన తనకు టీఆర్ఎస్లో సరైన గౌరవం ఇవ్వడం లేదని కొందరు సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ రోజున మాటవరుసకు తెలంగాణ భవన్ కు వచ్చి వెళ్లారని అంటున్నారు.