
హైదరాబాద్, వెలుగు: నగరంలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి అరుదైన గౌరవం దక్కింది. ఐపీఎల్ బెస్ట్ స్టేడియం అవార్డు లభించింది. ఈ అవార్డు దక్కడం నాలుగోసారి కావడం విశేషం. దేశంలోకెల్లా అత్యున్నత స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియం. టీ20 ఫార్మాట్‌కు అతికినట్టు సరిపోతుంది. షాట్లు అలవోకగా ఆడటానికి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటూనే.. బౌలర్లకు మంచి బౌన్స్ లభిస్తోంది. అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈఏడాది పరుగుల వరద పారించాడు. 692 పరుగులు సాధించి ప్రతిష్ఠాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ ఓపెనర్లు వార్నర్, జానీ బెయిర్‌స్టో పరుగుల పండుగ చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత అరుదుగా ఓపెనర్లరిద్దరూ సెంచరీలు బాదారు. ఇక రైజర్స్‌ను వీడుతూ మైదాన సిబ్బందికి వార్నర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే.
నాలుగోసారి రావడం ఆనందంగా ఉంది : క్యూరేటర్, చంద్రశేఖర్
నాలుగోసారి ఐపీఎల్ నుంచి బెస్ట్ స్టేడియం అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు క్యూరేటర్ చంద్రశేఖర్. 2014, 15, 16 ఎడిషన్లలో వరుసగా మూడు స్టార్లు బెస్ట్ స్టేడియం అవార్డు దక్కించుకొని హ్యాట్రిక్ నమోదు చేశామని తెలిపారు. ఇప్పుడు మరోసారి పురస్కారం లభించిందని, గ్రౌండ్ స్టాఫ్, సహాయ సిబ్బంది వల్లే ఈ ఘనత సాధించామని చెప్పుకొచ్చారు. తాము ఎప్పుడైనా టీమ్ వర్క్‌తోనే ముందుకెళ్తామని చెప్పారు. అత్యుత్తమ మైదానం అయినందు వల్లే రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కిందని గుర్తుచేశారు.
దేశంలో మరెన్నో పెద్ద స్టేడియాల ఉన్నా ఈసారి కూడా ఫైనల్‌ను హైదరాబాద్‌కు కేటాయించారంటే తమపై బీసీసీఐకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణకు చెందిన తనకు సౌత్‌జోన్ నుంచి బీసీసీఐ కో-అప్టెడ్ క్యూరేటర్‌గా గతేడాది అవకాశం ఇచ్చిందని, బోర్డు నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి మ్యాచ్‌కు మంచి పిచ్‌ను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ అద్భుతంగా సాగిందని, 2017 ఫైనల్ మాదిరిగా చివరి బాల్ వరకూ రిజల్ట్ తేలలేదంటే తాము బెస్ట్ వికెట్‌ను అందించినట్టేనని తెలిపారు. అందుకే మాకు అవార్డు దక్కిందని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.