టీఆర్​ఎస్​, మజ్లిస్ ల వల్లే హైదరాబాద్ మునిగింది

టీఆర్​ఎస్​, మజ్లిస్ ల వల్లే హైదరాబాద్ మునిగింది

వాళ్లది ఓటు బ్యాంకు రాజకీయం.. చెరువులు, నాలాలనూ ఆక్రమించారు

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదు?

అమరవీరుల చరిత్రను టీఆర్​ఎస్​ విస్మరిస్తోంది

ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బీజేపీ మేనిఫెస్టో

ఎల్​ఆర్​ఎస్​ పేరుతో టీఆర్​ఎస్​ దోపిడీ: సంజయ్

ఇక కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్​కే పరిమితం: వివేక్​ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: వరదలతో హైదరాబాద్​ మునగడానికి టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ అన్నారు. చెరువులు, నాలాలను కూడా విడిచిపెట్టకుండా విచ్చలవిడి ఆక్రమణలకు పాల్పడడంతోనే సిటీలో ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కరోనా టైమ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని, దీంతో పేదలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదని,  జీహెచ్ఎంసీ ద్వారా ఫ్రీగా వైద్య సేవలు అందిస్తుందని హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను గురువారం హైదరాబాద్‌లో ఫడ్నవీస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో పేద, మధ్యతరగతి వర్గాల ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టే రీతిలో ఉందన్నారు. కొన్ని పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేశాయని, కాని అందులో జనం బాధలు లేవని విమర్శించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించకుండా అమరవీరుల చరిత్రను టీఆర్ఎస్ సర్కార్ విస్మరిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని నిర్వహించుకుంటున్నారని, ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని దేవేంద్ర ఫడ్నవీస్​ ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీలో బీజేపీ గెలిస్తే వరదలతో నష్టపోయిన వారికి  రూ. 25 వేలు ఇస్తామన్నారు. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ఎల్ ఆర్ ఎస్ ను స్క్రాప్ చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీగా మార్చారు: భూపేంద్ర యాదవ్

‘కేసీఆర్ స్పృహలోకి రా. తెలంగాణ ప్రజలు నీ అవినీతి లెక్కలు అడుగుతున్నరు. వారికి జవాబివ్వు’ అని  బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్​చార్జ్​, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్  డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని మండిపడ్డారు. అవినీతి, అసమర్థ పాలనకు గ్రేటర్ ఎన్నికలతో ఇక్కడి ప్రజలు చరమగీతం పాడబోతున్నారని చెప్పారు. అన్ని వర్గాల వారిని ఆదుకునేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని అన్నారు.

మత కలహాలు సృష్టిస్తే కేంద్రం ఊరుకోదు: కిషన్​రెడ్డి

గ్రేటర్​ హైదరాబాద్​లో కొందరు గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ అనడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గొడవలు సృష్టించేది ఏ పార్టీ, ఎవరనేది కేసీఆరే చెప్పాలని డిమాండ్​ చేశారు.  ఇక్కడ మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ ఎంపీ, బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య ఓయూ కు వెళ్తే పోలీసులు కేసు ఎలా పెడుతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రోహింగ్యాలు ఉన్నారనే సమాచారం కేంద్రం వద్ద ఉందని, కరెక్టు టైమ్‌లో కేంద్రం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలను సంప్రదించి చర్యలు తీసుకుంటుందన్నారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులపై మజ్లిస్  పార్టీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించలేదన్నారు.

చాన్స్​ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపెడుతం: సంజయ్‌

అభివృద్ధి, ఆత్మగౌరవం.. ఈ రెండింటికి అద్దంపట్టేలా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉందని బీజేపీ స్టేట్ చీఫ్  బండి సంజయ్ చెప్పారు. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్​కు గ్రేటర్‌ జనం చాన్స్‌ ఇచ్చారని, ఈసారి తమకు ఇవ్వాలని కోరారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్నం. దేశంలోని 80% మున్సిపాలిటీల్లో బీజేపీ అధికారంలో ఉంది. గ్రేటర్ లో అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తం” అన్నారు. ఎల్​ఆర్​ఎస్‌తో జనం నుంచి రూ. 15 వేల కోట్లు ఆర్జించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసిందని,  దాన్ని తాము రద్దు చేసి భారం పడకుండా చూస్తామన్నారు. రూ. 10 వేల కోట్లతో   కొత్తగా సుమేధ చట్టం తీసుకొచ్చి ఆక్రమణలను అడ్డుకుంటామని చెప్పారు.   ‘‘మీ కోసం, మార్పు కోసం రూపొందించిన ఈ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ చదవాలి. అన్ని వర్గాల ప్రజల మేలు కోరి ఈ మేనిఫెస్టోను రూపొందించాం. మాది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో లోకల్ ఇష్యూలతో పాటు రాష్ట్ర, జాతీయ అంశాలను ప్రస్తావిస్తాం” అని చెప్పారు. ఆటో డ్రైవర్లకు రూ. 7 వేల సాయం అందిస్తామని, ప్రైవేట్ స్కూళ్లకు రాయితీలు ఇస్తామని చెప్పారు. ఒవైసీ, కేసీఆర్ రోజు మాట్లాడుకుంటారని, మరి ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదని, అక్కడ ఐటీ కంపెనీలు ఎందుకు పెట్టడం లేదని, మెట్రో రైల్ ఎందుకు వేయలేదని సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్​, కేటీఆర్​కు బుగులు పట్టుకుంది: వివేక్ వెంకటస్వామి

గ్రేటర్​ హైదరాబాద్​లో బీజేపీకి రోజు, రోజుకు ఆదరణ పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు బుగులు పట్టుకుందని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేనిఫెస్టో విడుదలతో వారిద్దరు ఫామ్ హౌజ్ కే పరిమితం కావాల్సి వస్తుందని విమర్శించారు. ‘‘ప్రజల సమస్యలను తెలుసుకొని, వారు ఏమి కావాలనుకుంటున్నారో అవే విషయాలను ఈ మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టో రూపొందించే ముందు ప్రత్యేక యాప్ ద్వారా, ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను  తెలుసుకున్నాం. సుమారు ఒక లక్ష మందికిపైగా తమ సమస్యలను వివరించారు. వాటి ఆధారంగానే ఈ మేనిఫెస్టో తయారైంది” అని వివేక్​ వెంకటస్వామి వెల్లడించారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయలను కూడా తీసుకున్నామన్నారు. ఈ మేనిఫెస్టో ఆచరణ సాధ్యమని, ప్రజల సమస్యలు పరిష్కారానికి ఇది నాంది పలుకుతుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ 2016 లో  చెప్పిందే, 2020 లో  చెప్పిందని, అప్పటి హామీలను అమలు చేయకపోవడంతో వాటినే మళ్లీ మేనిఫెస్టోలో విడుదల చేసిందని ఆయన విమర్శించారు.