ఆయిల్ పామ్ రైతులకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోవాలి : మంత్రి తుమ్మల

ఆయిల్ పామ్ రైతులకు జరిగే  అన్యాయాన్ని అడ్డుకోవాలి : మంత్రి తుమ్మల
  • దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి
  • మంత్రులకు లేఖలు రాసిన తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ రైతులకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో తుమ్మల మాట్లాడారు. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న డిమాండ్‌‌తో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్‌‌పై దిగుమతి సుంకాలను తగ్గించడంతో దేశీయ మార్కెట్‌‌లో చౌకగా విదేశీ ఆయిల్ లభిస్తోంది. దీంతో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులు మాత్రం లాభాలు అర్జిస్తున్నారన్నారు.

 దీన్ని అడ్డుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర వ్యవసాయ మంత్రులకు తుమ్మల లేఖలు రాశారు. ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలని, రైతుల పక్షాన వాదించాలని కోరారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమై, రైతులకు అనుకూలమైన దిగుమతి విధాన మార్పుల కోసం కృషి చేయాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్‌‌కు కనీస గ్యారంటీ ధర రూ.25 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. క్రూడ్ పామ్ ఆయిల్‌‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలన్నారు. రైతుల హక్కుల రక్షణ, వారి జీవనోపాధి కాపాడటం, దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.