24 గంటల్లో వాటర్‌‌ ట్యాంకర్‌‌

24 గంటల్లో వాటర్‌‌ ట్యాంకర్‌‌

హైదరాబాద్, వెలుగు నగరంలో నీటి ట్యాంకర్లను సమర్థవంతగా వినియోగించేలా జలమండలి చర్యలు తీసుకుంది. నల్లానీరు అందని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, పెరిగిన నీటి డిమాండ్ తో ట్యాంకర్ బుక్ చేసుకున్నా వచ్చే పరిస్థితి లేదు. దీంతో రోజుల కొద్ది ఎదురుచూపులే తప్ప.. బిందెడు నీళ్లు రావడంలేదనే ఫిర్యాదులు జలమండలికి ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో బుక్ చేసుకున్న ట్యాంకర్ సకాలంలో డెలివరీ అయ్యేలా, ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ లిస్టు త్వరగా క్లియర్ చేసేలా, దానికి అనుగుణంగా ట్యాంకర్ల సంఖ్య ను పెంచుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ట్యాంకర్ డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంది.

సిటీలో ఉచిత, పెయిడ్ ట్యాంకర్లుగా విభజించి నీటిని సరఫరా చేస్తుంది. నిత్యం నగరంలో 1200 ట్యాంకర్లను సరఫరా కోసం జలమండలి వినియోగిస్తుంది. అయితే నగరంలో పెరిగిన నీటి డిమాండ్ కారణంగా ట్యాంకర్ల అవసరం ఎక్కువైపోయింది. ఈ కారణంతో ట్యాంకర్ బుక్ చేసుకున్నా  కనీసం వారం రోజుల వరకు రావడం లేదు.  ఇలా దాదాపు 18వేల ట్యాంకర్లు డెలివరీ కాకుండా పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో రెచ్చిపోతున్న ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు అందినకాడికి దోచుకుంటున్నారు.

అయితే వేసవి దృష్ట్యా జలమండలి ఎండీ ముందస్తు చర్యలు తీసుకున్నా అంతగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక అధికారులు నియమించి ట్యాంకర్లపై పర్యవేక్షించినా ఫలితం లేదు.  అదే విధంగా మరో వంద ట్యాంకర్లను పెంచడంతో ట్యాంకర్ల సంఖ్య1200కు చేరింది. ఒక్కో ట్యాంకర్ మూడు నుంచి నాలుగు ట్రిప్పులు వేసేలా చర్యలు తీసుకుంది. కానీ ఒక్క ట్యాంకర్ రెండుకు మించి ట్రిప్పులతో సరఫరా చేయకపోవడంతో  రెండు నెలలుగా బుక్ చేసుకుని, డెలివరీ కాకుండా ఉన్న వెయిటింగ్ లో ఉన్న ట్యాంకర్ల సంఖ్య పెరిగిపోతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించిన అధికారులు, ట్రిప్పులు సంఖ్యను పెంచుతూ, సకాలంలో డెలివరీ అయ్యేలా ప్రత్యేక నిర్వాహణ చర్యలు తీసుకుంది.

పంపింగ్ చేయడంలోనే జాప్యం

ఒకవేళ బుక్ చేసుకున్న ట్యాంకర్ వచ్చినా, వినియోగదారుల ఇంటి ముందు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీనికితోడు సంపుల్లోకి పంపింగ్ చేసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఒక్క ట్రిప్పు పూర్తి చేయడానికి చాలా టైం తీసుకుంటున్న నేపథ్యంలో ట్యాంకర్ త్వరగా ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంది. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్ వెనుకలా నీటి సంపులు ఉండటం, ట్యాంకర్ కు ఉన్న  పైపు 10మీటర్ల పొడవుకు మించి ఉండకపోవడం, ట్యాంకర్ నీటిని నిల్వ చేసుకునేందుకు సరైన వసతులు లేకపోవడం, అదేవిధంగా కొన్ని భవనాలలో వెనుకాల నీటి సంపుల నిర్మాణం కారణంగా పంపింగ్ చేయడానికి టైం తీసుకుంటోందనీ ట్యాంకర్ల ఆపరేటర్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భ‌వ‌న యాజ‌మానులు త్వరగా పంపింగ్ చేయడానికి రోడ్డు వైపునకు నేరుగా ట్యాంకర్ పైపును జాయింట్ చేసేలా ప్రత్యేకంగా పైపును ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ట్యాంకర్ వచ్చిన అరగంటలోనే పంపింగ్ జరిగిపోయేలా ట్యాంకర్ డ్రైవర్లుకు ఆదేశాలు జారీ చేసింది.

పెద్ద ట్యాంకర్లతో సరఫరా వద్దు..

అదేవిధంగా క‌మ‌ర్షియ‌ల్ ట్యాంక‌ర్ల ట్రిప్పుల‌ను కుదించి, వాటిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించేలా జలమండలి చర్యలు తీసుకుంది. 20వేల లీటర్ల నీటి ట్యాంకర్ 3 ట్రిప్పులు, 10 వేల లీటర్ల ట్యాంకర్ కు 5 ట్రిప్పులకు మించి సరఫరా చేయకూడదనీ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం 1200 ట్యాంకర్లు ఉండగా, వీటిని 1300కు పెంచేందుకు సిద్ధం అవుతోంది. దీంతో కనీసం బుక్  చేసుకున్న మరుసటి రోజునే ట్యాంకర్ వచ్చే వీలు ఉంటుందనీ భావిస్తుంది. కాగా గతేడాది కంటే అదనంగా 300 ట్యాంకర్లను వినియోగిస్తున్నా, బుకింగ్ చేసుకునే వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.