శాంతించిన వరుణుడు...తగ్గిన వానలు

శాంతించిన వరుణుడు...తగ్గిన వానలు

హైదరాబాద్, వెలుగు: వారం రోజులుగా హడలెత్తిస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొన్నిచోట్ల మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్​ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర అల్ప పీడనం బలహీనపడి.. ఉత్తర ఒడిశా తీరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణపై నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగులగూడెంలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో 5.8, జైపూర్ లో 4.5, కొమ్మెరలో 4.1, హన్మకొండ జిల్లా పరకాలలో 4.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయినట్టు ప్రకటించింది.