ఫోర్బ్స్ లో హైదరాబాదీ

ఫోర్బ్స్ లో హైదరాబాదీ

క్రియేటివ్ మెంటర్స్ వ్యవస్థాపకుడు సురేశ్ రెడ్డి కొవ్వూరికి చోటు

హైదరాబాద్ , వెలుగు: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ చోటు సంపాదించారు. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్​, వీఎఫ్ ఎక్స్​ సంస్థ క్రియేటివ్ మెంటర్స్​ వ్యవస్థాపకుడు కొవ్వూరి సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రచురించిన కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 30 ఏళ్లలోపున్న ప్రభావవంతమైన 30 మంది వ్యక్తుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. సోమవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఆ వివరాలను వెల్లడించారు. సంస్థను స్థాపించిన 13 ఏళ్లలోనే అతి చిన్న వయసులో సురేశ్ రెడ్డి ఈ ఘనత సాధించడం అభినందనీయమని కంపెనీ ప్రతినిధులు కొనియాడారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడం తన జీవితంలో ఊహించని, మరచిపోలేని అనుభూతి అని సురేశ్ రెడ్డి చెప్పారు. చిన్న వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించి గొప్ప పేరు సాధించిన ప్రముఖ డైరెక్టర్ , నటుడు, నిర్మాత ఎల్ వీప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ జాబితాలో డాక్టర్ పీ శ్యామారాజు, రతన్​ టాటా, రాహుల్ బజాజ్ , హెచ్ సీ ఎల్ శివనాడార్ , యదూపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా , హావెల్స్​ అనిల్ రాయ్ గుప్తా, మహీంద్రా గ్రూప్స్​ అధినేత ఆనంద్మహీంద్రా సహా 51 మంది ప్రముఖ వ్యాపారవేత్తల మధ్య తన పేరు ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ నెలాఖరు నాటికి ఫోర్బ్స్ లిస్ట్​ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.