Ind vs Pak: ఈ సారి క్రేజ్ లేదు: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు అమ్ముడుపోని టికెట్లు.. రెండు కారణాలు ఇవే!

Ind vs Pak: ఈ సారి క్రేజ్ లేదు: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు అమ్ముడుపోని టికెట్లు.. రెండు కారణాలు ఇవే!

ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎగబడతారు. తరాలు మారినా.. ప్లేయర్లు మారినా దాయాదుల మధ్య సమరానికి ప్రతిసారి భారీ హైప్ ఉంటుంది. ఇండియా- పాక్ మ్యాచ్ కు టికెట్స్ రిలీజ్ చేస్తే క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆసియా కప్ లో ఇండియా- పాక్ మ్యాచ్ కు పెద్దగా బజ్ లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆసియా కప్ లో సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న మ్యాచ్ కు ఇంకా టికెట్స్ అమ్ముడుపోకపోవడమే ఇందుకు కారణం. 

భారత్- పాకిస్థాన్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఎప్పటిలాగే నిర్వాహకులు ఇండియా- పాకిస్థాన్ జట్టుకు ఒకే గ్రూప్ లో ఉంచారు. దాయాదుల మధ్య సమరం మరోసారి పైకి ఇవ్వడం ఖాయమనుకుంటే ఈ సారి బిగ్ షాక్ తగిలింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ కు నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ ఇంకా సగానికి పైగా టికెట్స్ అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలే బజ్ లేకపోగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రవేశపెట్టిన ‘ప్యాకేజ్ సిస్టమ్’ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.

ఆకాశాన్ని దాటిన టికెట్ రేట్లు: 

ప్యాకేజ్ సిస్టమ్ ఒకే మ్యాచ్‌కు టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఇతర గ్రూప్ మ్యాచ్‌లతో కలిపి ప్యాకేజీగా విక్రయిస్తున్నారు. ఈ ప్యాకేజీలలోని టికెట్ ధరలు క్రికెట్ ఫ్యాన్స్ కు భయపెడుతున్నాయి. కొన్ని ప్రీమియం ప్యాకేజీలు అయితే ఏకంగా రూ. 2.5 లక్షల వరకు ఉన్నాయి. VIP సూట్స్ ఈస్ట్‌లో ఇంకా టిక్కెట్లు మిగిలి ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక రాయల్ బాక్స్‌లో టిక్కెట్లు కూడా మిగిలి ఉన్నాయి. దీని ధర ఇద్దరు వ్యక్తులకు రూ. 2,30,700 కాగా, స్కై బాక్స్ ఈస్ట్ ధర రూ.1,67,851గా ఉంది. వయాగోగో, ప్లాటినంలిస్ట్‌లో రెండు సీట్ల ధర రూ. 2,57,815గా ఉంది.

విరాట్, రోహిత్, బాబర్, రిజ్వాన్ లేకుండానే మ్యాచ్:

ఈ సారి ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కు బజ్ లేకపోవడానికి కారణం ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు లేకపోవడమే అని తెలుస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత ఏడాది టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరికి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు పాక్ స్టార్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ ఆసియా కప్ ఆడడం లేదు. పేలవ ఫామ్ కారణంగా వీరిని అసలు ఆసియా కప్ కు సెలక్ట్ చేయలేదు.