ఇండియా ఆటో ఇండస్ట్రీ.. ఐదేళ్లలో నంబర్ వన్ఈవీ కంపెనీలకు ఎన్నో అవకాశాలు: నితిన్ గడ్కరీ

ఇండియా ఆటో ఇండస్ట్రీ..   ఐదేళ్లలో నంబర్ వన్ఈవీ కంపెనీలకు ఎన్నో అవకాశాలు: నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఇండియా ఆటోమొబైల్​ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్​ వన్​గా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. ఈ రంగంలో దేశానికి మంచి భవిష్యత్తు ఉందని, శిక్షణ పొందిన నిపుణులు ఉన్నారని చెప్పారు. దేశంలో అన్ని పెద్ద ఆటోమొబైల్​ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. దేశంలో తయారవుతున్న వాహనాల నాణ్యత బాగుందని, ఖర్చు తక్కువని మంత్రి చెప్పారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం భారత ఆటోమొబైల్​ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లు ఉంది. అమెరికాలో రూ.78 లక్షల కోట్లు, చైనాలో రూ.47 లక్షల కోట్లు ఉంది.

పెట్రోల్​, డీజిల్​వంటి శిలాజ ఇంధనాల దిగుమతి కోసం దేశం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. వీటివల్ల కాలుష్య సమస్య ఎదురవుతోంది. భారతీయ కంపెనీలు తయారుచేస్తున్న ఎలక్ట్రిక్​ కార్లు, బస్సులు, ట్రక్కులు చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. లిథియం -అయాన్​ బ్యాటరీల ధర కూడా తగ్గుతోంది’’అని గడ్కరీ అన్నారు. పెట్రోల్​, డీజిల్​ వాహనాల ధర, ఎలక్ట్రిక్​ వాహనాల ధర ఒకేలా ఉంటాయని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్​ బస్సుల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి  60 వేల వరకు ఉందని, కానీ దేశానికి లక్ష బస్సుల వరకు అవసరమని పేర్కొన్నారు. ఈవీ కంపెనీలకు ఇది మంచి అవకాశం అని, ఎగుమతికి కూడా పెద్ద మార్కెట్​ ఉందని గడ్కరీ అన్నారు.  పాత వాహనాలను స్క్రాప్​ చేయడం ద్వారా మంచి మెటీరియల్​లభిస్తుందని, దానిని 100 శాతం రీసైకిల్​ చేయవచ్చని గడ్కరీ చెప్పారు. డీలర్లు స్క్రాపేజీని ఒక అవకాశంగా చూడాలని మంత్రి సూచించారు.