
న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్‌కు దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. విజయంతో ఐపీఎల్‌ను ముగించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాంతో పాటు గతేడాది ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే ఈసారి పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్‌తో లీగ్‌ను ముగించాలని యోచిస్తోంది. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 రన్స్ తేడాతో నెగ్గిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ మరోసారి చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్ ఆకట్టుకున్నా.. జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, మలింగ మరింత ప్రభావం చూపెట్టాలి. వీళ్లందరూ కలిసికట్టుగా శ్రమిస్తే కేకేఆర్ హిట్టర్లను ఈజీగా అడ్డుకోవచ్చు. ఇక ఆర్సీబీతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు దూరమైన కేకేఆర్ కూడా మంచి ఆటతో లీగ్‌ను ముగించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే హిట్టర్లందరూ బ్యాట్లు ఝుళిపించాలి.
లీగ్‌కు విరామం రావడం వల్ల ప్లేయర్లందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారీ ఆశలు ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ తన సత్తాకు న్యాయం చేయలేకపోయాడు. కెప్టెన్ రహానే యంగ్‌స్టర్స్ కంటే బాగా ఆడుతుండటం కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం. గుర్బాజ్, నరైన్, రఘువంశీ, మనీష్ పాండే, రసెల్, రింకూ సింగ్ ఆఖరిసారిగా బ్యాట్లకు పని చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. బౌలింగ్‌లో వైభవ్ అరోరా ఒక్కడే అంచనాలు అందుకుంటున్నాడు. నరైన్ స్పిన్ మాయాజాలం పని చేయడం లేదు. రసెల్ కూడా బాల్‌తో ప్రభావం చూపలేకపోతున్నాడు.