- గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, గోపన్ పల్లి, కొత్వాల్‌గూడలో ఇల్లీగల్ దందా
- 8 క్రషింగ్ యూనిట్లు, మూడు ఆర్ఎంసీ ప్లాంట్లు నేలమట్టం
- బినామీ పేర్లతో బడా సంస్థల అండదండలతో ఏర్పాటు
- పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా యాక్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, గోపన్ పల్లి, శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడల్లో అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తూ క్రషింగ్, రెడీమిక్స్కాంక్రిట్ యూనిట్లు (ఆర్ఎంసీ) నడుపుతున్నవారిపై మంగళవారం హైడ్రా ఉక్కుపాదం మోపింది. పీసీబీ నోటీసులు, రెవెన్యూ శాఖ ఆదేశాలు, మైనింగ్ డిపార్టుమెంట్ అభ్యంతరాలను ఈ యూనిట్ల ఓనర్లు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం, కరెంట్సరఫరా నిలిపివేసినా డీజిల్వాడుతూ పనులు కానిస్తుండడంతో పీసీబీ, మైనింగ్ తో పాటు రెవెన్యూ శాఖలు హైడ్రా సహకారం కోరాయి.
హైడ్రా విచారణలో సదరు ఓనర్లు బినామీ పేర్లతో బడా సంస్థల అండదండలతో అక్రమంగా ఏర్పాటు చేసినట్టు గుర్తించింది. ఏ ఒక్కదానికి మైనింగ్‌తో పాటు, పీసీబీ అనుమతులు లేనట్లు తెలుసుకుంది. భగత్‌సింగ్ స్టోన్ క్రషర్, ఎస్‌వీకే, పరమేశ్వర్ స్టోన్, ప్రథ్వి, గ్రేట్ ఇండియా మైనింగ్, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్లతో పాటు బీఎస్ఆర్, అల్ట్రాటెక్, ఏసీసీ రెడీమిక్స్ ప్లాంట్లు ఇందులో ఉన్నాయని తెలుసుకుంది.
రంగంలోకి దిగి 8 క్రషింగ్ యూనిట్లతో పాటు 13 ఆర్ఎంసీ ప్లాంట్లలో మూడింటిని నేలమట్టం చేసింది. మిగిలిన 10 ఆర్ఎంసీ ప్లాంట్లకు సంబంధించి విలువైన మెటీరియల్ఉందని, తమంతట తామే తొలగిస్తామని చెప్పడంతో ఊరుకుంది. తొలగించిన చోట భవిష్యత్తులో స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా చేసింది.
కొండలు మాయం....
పలు ఇండస్ట్రీలు ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న కొండలను ధ్వంసం చేసి మరీ వ్యాపారం చేస్తున్నాయి. కొత్వాల్ గూడలో ఇప్పటికే వందలాది ఎకరాల్లో తవ్వకాలు జరిపారు. ఇక్కడ గతంలో ఓఆర్ఆర్ నిర్మించేందుకు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి తవ్వకాలు జరిగాయి. అక్కడే ప్రభుత్వానికి సంబంధించిన పనులకు కాకుండా ఇష్టానుసారం క్వారీలు తవ్వి.. స్టోన్ క్రషింగ్‌తో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేస్తున్నారు.
బండ రాళ్లను పేల్చి మరీ అక్రమంగా దందా చేస్తున్నారు. క్రషింగ్ మెషీన్లు ఒకచోట ఏర్పాటు చేసి మరోచోట నుంచి బండరాళ్లను తెచ్చి కూడా దందా చేస్తున్నారు. కొత్వాల్‌గూడలో దాదాపు 16 ఎకరాల మేర విస్తరించి అందులో 7 ఎకరాల వరకు కొండల్ని తవ్వేశారు. తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్ ఇక్కడ నడుస్తోంది. దీన్ని పూర్తిగాతొలగించారు. ఇక్కడే మరో రెండు ఆర్ ఎంసీ ప్లాంట్లను తొలగించారు. కరెంట్ బిల్లులు రూ. కోట్లలో బకాయిలు ఉండటంతో కరెంట్ కట్ చేస్తే డీజిల్ తో నడుతున్నారు. అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి
కొడుతున్నారు.
ఘట్కేసర్లో అక్రమ కట్టడాల కూల్చివేత
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. యమ్నపేటలో జీ+2 అనుమతి తీసుకుని, ఏకంగా ఐదు అంతస్తులు నిర్మించిన భవనాలపై ఏసీపీ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. అనుమతి లేని నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
