గంగారాం చెరువు ప‌‌రిశీలించిన హైడ్రా చీఫ్​

గంగారాం చెరువు ప‌‌రిశీలించిన హైడ్రా చీఫ్​
  • డంపింగ్​ జరుగుతుందన్న ఫిర్యాదుతో ఫీల్డ్​లోకి ..
  • ఇప్పటికే కేసులు పెట్టామన్న రంగనాథ్​

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్​మెట్/ముషీరాబాద్, వెలుగు: చందాన‌‌గ‌‌ర్‌‌లోని గంగారం చెరువును హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ గురువారం ప‌‌రిశీలించారు. చెరువులో డంపింగ్ జ‌‌రుగుతున్న హైడ్రా క‌‌ట్టడి చేయ‌‌లేక‌‌పోతోంద‌‌ని శేరిలింగంప‌‌ల్లి ఎమ్మెల్యే అరెక‌‌పూడి గాంధీ చేసిన వ్యాఖ్యల నేప‌‌థ్యంలో క‌‌మిష‌‌న‌‌ర్ ఫీల్డ్​విజిట్​చేశారు. 

మీడియాతో మాట్లాడుతూ 2023 డిసెంబ‌‌ర్ లో డంపింగ్ చేసిన వారిపై ఇరిగేష‌‌న్ అధికారులు కేసులు పెట్టగా, తాజాగా హైడ్రా డీఆర్ఎఫ్ లేక్ ప్రొటెక్షన్ గార్డులు చందాన‌‌గ‌‌ర్ పీఎస్​లో ఫిర్యాదు చేశార‌‌ని చెప్పారు. హైడ్రా పీఎస్​వచ్చేవరకు స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు పెడ‌‌తామ‌‌న్నారు. ప్రతి చెరువు ద‌‌గ్గర హైడ్రా లేక్ ప్రొటెక్షన్ గార్డులు ఉంటారని, వీరు 24 గంట‌‌లు డ్యూటీ చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట చందాన‌‌గ‌‌ర్ కార్పొరేట‌‌ర్ మంజుల‌‌ ఉన్నారు. తర్వాత బోరబండలోని సున్నం చెరువును విజిట్​చేసి పునరుద్ధరణ పనులు స‌‌మీక్షించారు.  

మాస‌‌బ్​ చెరువులో రోడ్డు తొలగింపు  

అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని తుర్కయాంజ‌‌ల్‌‌ మాస‌‌బ్ చెరువు ఎఫ్‌‌టీఎల్ ప‌‌రిధిలో నిర్మించిన రోడ్డును హైడ్రా తొలగిస్తోంది. 700 ఎక‌‌రాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు అడ్డంగా రియ‌‌ల్ ఎస్టేట్ వ్యాపారులు 300 మీట‌‌ర్ల ప‌‌రిధిలో 60 అడుగుల వెడ‌‌ల్పుతో రోడ్డు వేస్తుండడంతో తొలగించే పని ప్రారంభించింది. 

ఇదే అంశాన్ని ఇబ్రహీంప‌‌ట్నం ఎమ్మెల్యే మ‌‌ల్‌‌రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇప్పటికే చెరువు ఎఫ్ టీ ఎల్ స‌‌రిహద్దలును హెచ్ఎండీఏ నిర్ధారించడంతో చెరువులోనే రోడ్డు నిర్మించిన‌‌ట్టు హైడ్రా విచార‌‌ణ‌‌లో వెల్లడైంది. గురువారం రోడ్డు తొల‌‌గించే పని మొదలుపెట్టారు. 

కంచెను తొలగించిన హైడ్రా

కవాడిగూడలోని కల్పన థియేటర్ సమీపంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించింది. మిగిలిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణం ఆగింది. ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే సమీపంలోని అపార్ట్​మెంట్ వాసులు రోడ్డును కుదించి కంచె వేశారని హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో గురువారం రోడ్ సైడ్ వేసిన ఇనుప కంచెను అధికారులు తొలగించారు.