రెండు నెలల పసికందుకు పునర్జన్మ

రెండు నెలల పసికందుకు పునర్జన్మ
  • కిమ్స్ కడల్స్ డాక్టర్ల అరుదైన గుండె శస్త్రచికిత్స 

మాదాపూర్, వెలుగు: రెండు నెలల పసికందుకు కొండాపూర్​లోని కిమ్స్ కడల్స్ డాక్టర్లు అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన రెండు నెలల శిశువుకు శ్వాసకోస సమస్యలు, గుండె వైఫల్య లక్షణాలు ఉండటంతో కుటుంబసభ్యులు కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి ‘ఏఆర్ సీఏపీఏ’ అనే అత్యంత అరుదైన గుండె లోపాన్ని గుర్తించారు. సాధారణంగా గుండెకు శుభ్రమైన రక్తం.. కొరోనరీ ఆర్టరీ ఏఓర్టా అనే రక్తనాళం  నుంచి రావాల్సి ఉండగా, ఈ చిన్నారిలో అది ఊపిరితిత్తులకు వెళ్లే పల్మనరీ ఆర్టరీ నుంచి వస్తున్నట్లు గుర్తించారు.

దీంతో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అపర్ణ పర్యవేక్షణలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనిల్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నాగరాజన్, నీయోనటాలజీ బృందం అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీని నిర్వహించారు. ప్రత్యేక ‘హుడ్’ టెక్నిక్ ద్వారా ఆ రక్తనాళాన్ని పల్మనరీ ఆర్టరీ నుంచి వేరు చేసి ఏఓర్టాకు విజయవంతంగా అనుసంధానించారు. రక్తనాళాలు అతి చిన్నవిగా ఉండటం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి సవాళ్లను అధిగమిస్తూ రక్త ప్రసరణను పునరుద్ధరించడం ద్వారా పసికందు ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదించారు.