
రెండు నెలల్లో బతుకమ్మ కుంట పనులు పూర్తి చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా స్థాపించి జులై 19తో సంవత్సరం పూర్తవుతుంది. ఈ క్రమంలో అంబర్ పేటలోని బతుకమ్మ కుంటలో విద్యార్థులతో, హైడ్రా అధికారులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన రంగనాథ్ .. బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని కంప్లైంట్ ఆధారంగా నాలుగు నెలలుగా వివిధ దశల్లో అధికారులతో పరిశీలించి 17 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇంకా రెండు నెలల్లో పనులు మొత్తం పూర్తి చేసి బతుకమ్మ సంబరాలను ముఖ్యమంత్రితో చేసే విధంగా ప్రయత్నిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సంవత్సర కాలంలో సామాజిక కోణంలో పనిచేశామని, ఇంకా ముందు కూడా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పారు.
ఎవర్నీ వదల్లేదు..
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ చెరువుల ఆక్రమణలను నివారిస్తామని, హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీటిలా చేస్తామని హామీలిచ్చినప్పటికీ, ఆ పనులు జరగలేదు. ఎన్కన్వెన్షన్ వంటి ఆక్రమణలను కూల్చివేస్తామన్నా చర్యలు తీసుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే హైడ్రా ద్వారా చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. గతేడాది జూన్ 27న ఫిల్మ్‌నగర్‌లోని కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చడంతో హైడ్రా యాక్షన్ మొదలైంది. అప్పట్నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు ఇలా ఎవరి ఆక్రమణలు వదల్లేదు.
ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు రూ. 30 వేల కోట్ల ఆస్తులను పరిరక్షించింది. ఇందులో 360 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, లేఅవుట్, తదితర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 218.30 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 10.65 ఎకరాలను కాపాడింది. అలాగే 5.94 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూల్చేసింది.