
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం (జూన్ 27) ఐఎస్ సదన్ కృష్ణా నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. కాగా, ఐఎస్ సదన్ కృష్ణా నగర్లో నాళాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
నాలా ఆక్రమణతో వర్షాకాలంలో ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి హైడ్రా అధికారులు.. అక్రమిత స్థలానికి పరిశీలించారు. నిజంగానే కొందరు నిబంధనలకు విరుద్ధంగా నాలాలను అక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు నిర్ధారించారు.
అనంతరం అక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను అక్రమార్కుల చెర నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.