- హైడ్రాకు సిటీ శివారు జిల్లాల కలెక్టర్ల విన్నపం
హైదరాబాద్, వెలుగు: చెరువుల్లో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను గుర్తించి పరిపాలనపరమైన ప్రక్రియను పూర్తి చేశామని, హైడ్రా వచ్చి వాటిపై చర్యలు తీసుకోవాలని నగర శివారు జిల్లాల కలెక్టర్ల నుంచి హైడ్రాకు విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు సంబంధించి నోటీసులను జారీ చేశారు.
తమ జిల్లాల పరిధిలోని చెరువుల్లో, ప్రభుత్వ భూముల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సపోర్ట్ అందించాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు హైడ్రాకు లేఖలు రాసినట్టు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద పూర్తి స్థాయిలో సిబ్బంది లేనందున తాము చర్యలు తీసుకోవడంలో జాప్యం చోటుచేసుకుంటుందన్నది కలెక్టర్ల అభిప్రాయం.
కూల్చివేతలకు ముందు కట్టడాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి నోటీసుల ప్రక్రియను ఇప్పటికే కలెక్టర్లు పూర్తి చేశారు. అందువల్ల కూల్చివేతలకు సహకరించాలని హైడ్రాను
కోరుతున్నారు.