
నైరుతు రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో రోహిణీ కార్తిలో ఉండాల్సిన ఎండల తీవ్రత తగ్గి వాతావరణం అంతా చల్లబడింది. బుధ, గురు వారాల్లో (మే 21, 22) తెలంగాణ్య వ్యాప్తంగా వర్షాలు కురిన తర్వాత.. మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు 2,-3 రోజులలో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించింది. గురువారం (మే 22) తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో, తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదలుతూ, రానున్న 36 గంటల్లో మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశముంది.ఇది క్రమంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వాయుగుండం ఇంకా బలపడే అవకాశంతో తీవ్ర వాయుగుండంగా మారె ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.
శుక్రవారం (మే 23) ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 40-50 కి.మీతో ఉంటుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదే విధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మిగితా అన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
చురుగ్గా కదులుతున్న నైరుతి రూతుపవనాలు:
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ.. మరో రెండు ముడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో మరో నాలుగు రోజులు 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
ఈనెల 27 మే 2025 నాటికి పశ్చిమ మధ్య , సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడే సూచనలున్నాయి. దీంతో 27 నుంచి తెలంగాణ లో మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.