
Bengaluru IT News: ప్రాంతీయ భాషపై మమకారం ఉంటం సమహజమే. కానీ అది ఒక స్థాయి దాటిన తర్వాత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. వాస్తవానికి చాలా కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలో కన్నడ మాట్లాడటం గురించి కన్నడిగులకే ఉద్యోగాలను అందించాలనే వాదనలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత ఐటీ పరిశ్రమకు, స్టార్టప్ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న బెంగళూరు భాషాపరమైన వివక్ష గొడవలతో దాని పేరు మసకబారుతోంది.
తాజాగా దీనిపై బెంగళూరు కేంద్రంగా టెక్ కంపెనీని నడుపుతున్న వ్యవస్థాపకుడు కౌషిక్ ముఖర్జీ స్పందించారు. తమ కంపెనీ కార్యాలయాన్ని బెంగళూరులో 6 నెలల్లో క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. భాషాపరమైన వివక్షతో ఆఫీసులోని ఇతర ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున పూణేకు కార్యకలాపాలను మార్చుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో కన్నడ భాషకు సంబంధించిన గొడవలు తమ ఉద్యోగులకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని దీనిపై సకాలంలో స్పందించటం అవసరమని కంపెనీ భావించినట్లు చెప్పారు ముఖర్జీ. ఉద్యోగుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకే ఈ షిఫ్ట్ జరుగుతోందని అన్నారు.
ఇటీవల స్టేట్ బ్యాంక్ మేనేజర్ కస్టమర్ తో కన్నడలో మాట్లాడకపోవటంపై చెలరేగిన రగడ చివరికి ఆమెను వేరే ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేసే వరకు వెళ్లింది. ఇలాగే తమ ఉద్యోగులు భవిష్యత్తులో టార్గెట్ అయ్యే అవకాశం ఉండొచ్చని ముఖర్జీ అన్నారు. తమ సంస్థలోనే ఉద్యోగులే మెుదటి ఆఫీసు మార్పు గురించి రిక్వెస్ట్ చేశారని, వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాక బెంగళూరును వీడటం సరైన నిర్ణయేనన్నారు.
దీనిపై స్పందించిన నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకరు హైదరాబాదుకు వెళ్లండి అక్కడ భాషకు సంబంధించి పెద్దగా ఎలాంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. మరొకరు స్పందిస్తూ పూణే మహారాష్ట్రలో ఉందని అక్కడి మారాఠాలు తమ స్థానికి భాషలో మాట్లాడటానికే ఇష్టపడతామని.. మేము కన్నడిగులకు అండగా ఉంటామని కామెంట్ చేశారు. పైగా హిందీ ఎక్కువగా మాట్లాడే నగరాలకు ఆఫీసు మార్చుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇక చివరిగా ఒక వ్యక్తి గురుగ్రామ్ లేదా హర్యాణా రండి ఇక్కడ అలాంటి సమస్యలు అస్సలు ఉండవంటూ కామెంట్ చేశారు.