
- అక్రమ పట్టాలు చేస్తూ రెవెన్యూ అధికారులు జైలుకు..
- లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీసులు
- నకిలీ డాక్టర్ల వ్యవహారంలో డీఎంహెచ్ఓపై ఎంక్వైరీ
- సొంత శాఖ ఆఫీసర్లపై కలెక్టర్ కు ఇరిగేషన్ స్టాఫ్ కంప్లైట్
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అవినీతి, అక్రమాలకు సూర్యాపేట జిల్లా కేరాఫ్ గా నిలుస్తోంది. ప్రతి శాఖలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక దిక్కు ఏసీబీ దాడులు, మరోవైపు ఆయా శాఖల ఉన్నతాధికారుల ఎంక్వైరీలతో అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్నాయి.
ఆక్రమాల్లో రెవెన్యూ టాప్
ఆక్రమాలలో రెవెన్యూ శాఖది మొదటి స్థానం. ధరణిని అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు అక్రమ పట్టాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. హుజూర్ నగర్ మండలంలో రైతుబంధు అమౌంట్ కోసం ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చిన తహశీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ లపై కేసులు నమోదయ్యాయి. మోతే మండలంలో రికార్డులను ట్యాంపరింగ్ చేయగా తహశీల్దార్ తో పాటు ముగ్గురు ఆర్ఐలు, వీఆర్వో, వీఆర్ఏ లపై కేసులు నమోదు చేశారు.
ఇటీవల ఆత్మకూర్(ఎస్) మండలంలో రికార్డులలో పేరు లేకపోయినా ఇద్దరు అన్నదమ్ముల నుంచి డబ్బులు తీసుకొని పట్టాలు చేసినట్టు గుర్తించి డీటీ, ఇద్దరు ఆర్ఐలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెండ్ చేశారు. గతంలో కోదాడ లో ఒకరి భూమిని మరొకరి పేరు మీద అక్రమంగా పట్టా చేయగా.. తహశీల్దార్ ను కలెక్టరేట్ కు ఆటాచ్ చేసి ఆర్ఐ ను సస్పెండ్ చేశారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 20 మంది రెవెన్యూ సిబ్బంది పై వేటు పడింది.
ఏసీబీకి చిక్కిన పోలీసులు
జిల్లాలో పోలీసుల అవినీతి వ్యవహారాలు ఆ శాఖ పరువు తీస్తున్నాయి. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారి లంచాలు తీసుకుంటూ ఏసిబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ కోసం భారీగా వసూళ్లకు పాల్పడుతుండడంతో భాదితులు ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఐదుగురు పోలీసులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు తీసుకుంటూనే పట్టుబడ్డారు.
సూర్యాపేటలో ఒక స్కానింగ్ సెంటర్ నిర్వహకుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసిన డీఎస్పీ ఏసీబీకి దొరికారు. దీంతో పోలీస్ శాఖ ప్రక్షాళనపై జిల్లా ఎస్పీ దృష్టి పెట్టారు. మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న 64 మందిని బదిలీ చేశారు. ఎస్పీ ఆఫీస్ లో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై రెండు రోజులకింద వేటు వేశారు. వివాదాస్పద ఎస్సైలను త్వరలో బదిలీ చేయనున్నట్టు సమాచారం.
ఇరిగేషన్ శాఖలో అవినీతి
సూర్యాపేట ఇరిగేషన్ శాఖలో కొందరు అధికారులు కాల్వలు బంద్ చేసి .. డబ్బులు ఇచ్చిన ప్రాంతాలకే నీటిని విడుదల చేస్తున్నారన్న విమర్శలున్నాయి. చాలా చోట్ల చెరువుల్లోని మట్టిని అక్రమంగా అమ్ముకుని రూ. లక్షలు దండుకున్నారని అదేశాఖకు చెందిన ఉద్యోగులే గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు ఆఫీసుకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని, సొంత వెహికిల్స్ కు దొంగ బిల్లులు పెట్టి అద్దె తీసుకుంటున్నారని ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డీఎంహెచ్ఓపై ఎంక్వైరీ
సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడంతో డీఎంహెచ్ఓ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అర్హతలు, పర్మిషన్స్ లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. చాలాకాలంగా ఈ దందా నడుస్తున్నా డీఎంహెచ్ఓ పట్టించుకోలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ తనిఖీల తర్వాత కూడా నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోలేదు. ఈ విషయం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ దృష్టికి వెళ్లడంతో ఎంక్వైరీ ఆదేశించారు. వారం రోజుల కింద ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు డీఎంహెచ్ ఓపై ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు.