ఇక పార్కులపై ఫోకస్ ఓఆర్ఆర్ పరిధిలో లెక్క తేలుస్తున్న హైడ్రా

 ఇక పార్కులపై ఫోకస్ ఓఆర్ఆర్ పరిధిలో లెక్క తేలుస్తున్న హైడ్రా
  • గత విస్తీర్ణం.. ఇప్పుడు ఎంత ఉందన్న దానిపై ఆరా
  • నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా పరిశీలన
  • ఆక్రమణలకు గురైతే కాపాడేందుకు చర్యలు
  •  బడాబాబుల ఆక్రమణలపైనే దృష్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు:హైడ్రా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పార్కులపై హైడ్రా ఫోకస్​పెట్టింది. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడడమే హైడ్రా ప్రధాన లక్ష్యం కాగా, ఇప్పటికే చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం పార్కులు? గతంలో వాటి విస్తీర్ణం ఎంత.. ఇప్పుడు ఎంత ఉంది అనే లెక్కలు తీస్తోంది. చెరువుల విషయంలో వ్యవహరించినట్టే ఎక్కడైనా పార్కులు ఆక్రమణలకు గురైతే, వాటిని గుర్తించి కాపాడేందుకు యాక్షన్​ప్లాన్​సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ ఎస్ సీ) శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించుకుంటున్నారు. వాటి ఆధారంగా పార్కుల విస్తీర్ణం, జరిగిన ఆక్రమణలను గుర్తించనున్నారు. 

పార్కులపై సైతం  ఫిర్యాదులు

హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో చెరువులు, నాలాలతో పాటు పార్కులకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. లేఅవుట్లు వేసే టైంలో మ్యాప్ లో పార్కు స్థలాలను చూపి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఆ తర్వాత ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నాక పార్కులను డెవలప్ చేయకుండా అలాగే వదిలిస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత ఆ పార్కుల స్థలాలకు డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇక కాలనీల్లో చోటా మోటా లీడర్లు పార్కుల స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఇప్పటికే హైడ్రాకు చాలానే వచ్చాయి. వీటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్​ఓఆర్ఆర్ పరిధిలో పార్కులపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అయితే, ఈ ఆక్రమణల్లో ఎవరైనా పేదలుంటే వారి జోలికి వెళ్లకుండా, బడా బాబులు ఆక్రమించిన వాటిపైనే ప్రధానం ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. 

హైడ్రా పరిధిలో దాదాపు 1500 పార్కులు?

హైడ్రా పరిధిలో దాదాపు1500  పార్కులు ఉంటాయని అధికారుల అంచనా. ఇందులో బల్దియా పరిధిలోనే  985 పార్కులున్నాయి.  ఇందులో 19 మేజర్,17 థీమ్ పార్కులు కాగా, మిగతావి కాలనీల్లోని పార్కులు.. ఇలా శివారు మున్సిపాలిటీల్లో అన్ని కలిపితే దాదాపు 1500 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటిని1970 సర్వే ఆఫ్ ఇండియా టోపో గ్రాఫిక్ షీట్లు, రెవెన్యూ రికార్డులు, పాత శాటిలైట్ మ్యాప్ తో కూడా పోల్చి చూసి, పార్కుల అసలు విస్తీర్ణం, మార్పులను స్పష్టంగా తెలుసుకోనున్నారు. పార్కుల స్థలాలను కాపాడిన తర్వాత ఫెన్సింగ్​ వేసి డెవలప్ చేయాలని హైడ్రా ప్లాన్ చేస్తోంది.