పెండింగ్ బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

పెండింగ్ బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి
  • టీచర్స్​ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని టీచర్స్​​ ఎమ్మెల్సీ  పింగిళి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఆర్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  పీఆర్సీ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించామన్నారు. 

పండిట్ పీఈటీ అప్ గ్రేడేషన్​కు కృషి చేసి సాధించామన్నారు.  పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, టీఎన్జీఎల్ఐ, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ మంజూరు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సీపీఎస్ ఉద్యమాన్ని గత సెప్టెంబర్ 1న పెన్షన్ విగ్రహ దినంగా పాటించి వేలాది మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్ లో ధర్నా నిర్వహించామని, ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు.  ఇచ్చిన హామీ మేరకు  మైనార్టీ గురుకులాలకు కామన్ టైం టేబుల్ ని సాధించామన్నారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బదిలీలు ఇప్పించామని, త్వరలోనే జీరో వన్ జీరో ద్వారా వేతనాలు ఇప్పిస్తామన్నారు. 

కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్ కోసం కృషి చేస్తున్నామన్నారు. 2008 డీఎస్సీ వారిని రెగ్యులేషన్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేశ్​ప్రవేశపెట్టిన ప్రధాన కార్యదర్శి నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని జిల్లా శాఖ పక్షాన సన్మానించారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, తీగల నరేశ్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్ రావు, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.