హైదరాబాద్ సిటీ, వెలుగు: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో రెండు పార్కులను హైడ్రా బుధవారం కాపాడింది. బృందావన్ కాలనీలో రూ. 39 కోట్ల విలువైన 2,300 గజాల పార్కును కాపాడగా.. కౌశల్యా కాలనీలోని 300 గజాల పరిధిలోని బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన అధికారులు.. పార్కు స్థలాలుగా గుర్తించి బుధవారం ఆక్రమణలను తొలగించారు.
దీంతో బృందావన్ కాలనీ నివాసితులు పార్కుకు వచ్చి సంబురాలు చేసుకున్నారు. సర్వే నంబరు 93లో ఉన్న ఈ స్థలాన్ని పార్కు స్థలంగా గతంలోనే నిర్ధారించారు. అయితే సర్వే నంబరు 94 కి సంబంధించిన ల్యాండ్‌గా స్థానికంగా పేర్కొంటూ కొందరు కబ్జా చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కు స్థలంలోని పిల్లల ఆటవస్తువులు ధ్వంసం చేసి.. పార్కు బోర్డును తొలగించి, ప్రహరీని కూడా కూల్చేసి కబ్జా చేశారు. బృందావన్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, హైడ్రా సంబంధిత స్థానిక అధికారులతో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.
