- హైటెక్ హంగులద్దుతున్న హైడ్రా..
- మురుగుకు చెక్‌పెట్టి ముస్తాబు ..
- టూరిజం స్పాట్‌గా మారనున్న లేక్..
ఉప్పల్ నల్ల చెరువు హైటెక్ హంగులతో మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుకుంటోంది. రూ. 20 కోట్లతో ఈ చెరువును శుద్ధి చేసి టూరిజం స్పాట్‌గా డెవలప్ చేసేందుకు కొన్ని నెలల క్రితం హైడ్రా బ్యూటిఫికేషన్ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే అంబర్‌పేట బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్ల చెరువును అద్భుతంగా తీర్చిదిద్దిన హైడ్రా మరికొన్ని చెరువుల సుందరీకరణలో నిమగ్నమైంది. ఇందులోనే ఉప్పల్నల్లచెరువు కూడా ఉంది.
ఉప్పల్, వెలుగు: మురుగు నీళ్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమై కంపుతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురిచేసిన ఉప్పల్నల్ల చెరువు రూపురేఖలు మార్చుకుంటోంది. నేషనల్హైవే పక్కనున్న నల్ల చెరువును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రూ. 20 కోట్ల హెచ్ఎండీఏ ఫండ్స్ తో హైడ్రా ముందడుగేసింది. హైదరాబాద్‌లోని పలు చెరువులకు ప్రాణం పోస్తున్న హైడ్రా 64 ఎకరాల్లో ఉప్పల్నల్ల చెరువు బ్యూటిఫికేషన్‌ను కూడా భుజానవేసుకుంది.
గత ఏడాది పనులు మొదలు పెట్టి ముందుగా గుర్రపు డెక్క పూర్తిగా తొలగించింది. మురుగు నీటిని తోడేసి పూడికతీసింది. చెరువులోకి నాచారం పెద్ద చెరువు నుంచి వచ్చే మురుగు నీటిని ఇప్పటికే డైవర్ట్ చేసి ఎస్టీపీలోకి మళ్లించింది. చుట్టూ వాకింగ్‌ట్రాక్, వాటర్ఫౌంటెయిన్లు, పార్కులు, పిల్లల ఆటస్థలాల పనులు కొనసాగుతున్నాయి. బండ్నిర్మాణం జరుగుతోంది. మరో ఆరు నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
నల్ల చెరువు.. తెల్ల చెరువవుతోంది
నల్ల చెరువు రానున్న రోజుల్లో తెల్ల చెరువుగా మారబోతోంది. పునరుద్ధరణ, సుందరీకరణతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రాబోతోంది. నల్ల చెరువుతో పాటు నియోజకవర్గంలోని పలు చెరువుల అభివృద్దికి రూ. 150 కోట్లు సీఎంతో శాంక్షన్ చేయించాం. బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, ఉప్పల్----------
