హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో ప్లాట్లకు చుట్టూ నిర్మించిన అడ్డుగోడను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చేశారు. ప్రతాపసింగారం భవానీనగర్‌లోని సర్వే నంబర్లు 315, 316, 317లలో 27 ఎకరాల పరిధిలో లేఅవుట్వేశారు. దాదాపు 400ల ప్లాట్లతో1978లో వేసి ఈ లేఅవుట్‌కు గ్రామ పంచాయతీ అనుమతి ఉండగా, తర్వాత మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. ఆరుగురికి చెందిన ఈ 27 ఎకరాల్లో భాగస్వామిగా ఉన్న మలిపెద్ది బుచ్చిరెడ్డికి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఇవ్వడంతో ఈ లేఅవుట్ వేశారు.
మొత్తం 27 ఎకరాల లేఅవుట్లో మలిపెద్ది జనార్దన్ రెడ్డికి 6.14 ఎకరాల భూమి ఉండగా, ఆయన కొడుకు మలిపెద్ది మధుసూధన్ రెడ్డి ధరణిలో దరఖాస్తు చేసుకుని వ్యవసాయ భూమిగా పాసు బుక్ సృష్టించడంతో పాటు రైతు బంధు పథకం డబ్బులు కూడా తీసుకోవడం ప్రారంభించారన్నారు. అంతటితో ఆగకుండా ప్రహరీ నిర్మించడంతో 6.14 ఎకరాల పరిధిలోని 88 ప్లాట్లకు చెందిన వారు అభ్యంతరాలు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రైతు బంధు రద్దయ్యింది. అయినప్పటికీ 8 ఏండ్లుగా తమ ప్లాట్ల కోసం పోరాడుతున్నారు.
ఇదే విషయమై ఇటీవల భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా రహదారులను ప్రహరీతో బ్లాక్ చేశారంటూ వాపోయారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం 27 ఎకరాల పరిధిలో లేఅవుట్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి మున్సిపల్, గ్రామపంచాయతీ అనుమతులు లేకపోవడంతో శుక్రవారం కూల్చివేశారు. దీంతో 8 ఏళ్లుగా పోరాడుతున్నామని.. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ సమస్య పరిష్కారం అయ్యిందని ప్లాట్ల ఓనర్లు సంబురాలు చేసుకున్నారు.
