దుర్గం చెరువులో ఆక్రమణల తొలగింపు.. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల్లో ఆక్రమణలు

దుర్గం చెరువులో ఆక్రమణల తొలగింపు.. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల్లో ఆక్రమణలు
  • చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్‌‌‌‌ దందా
  • నెలకు రూ. 50 లక్షల వరకు అద్దెలు వసూలు
  • ఖాళీ చేయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన హైడ్రా

మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లో ఎత్తైన కొండల మధ్య సీక్రెట్ లేక్​గా పేరుగాంచిన దుర్గం చెరువును కబ్జాదారుల కబంద హస్తాల నుంచి హైడ్రా కాపాడింది. ఇనార్బిట్ మాల్ వైపు చెరువు స్థలంలో మట్టి పోసి 5 ఎకరాల వరకు కబ్జా చేసి వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్న ప్రాంతాన్ని మంగళవారం హైడ్రా అధికారులు ఖాళీ చేయించి, ఫెన్సింగ్ వేశారు.

ఇటీవల ఇనార్బిట్ మాల్ వైపు చెరువు స్థలంలో మట్టిని నింపి, పార్కింగ్ చేసేందుకు అద్దెకిచ్చి ప్రతి నెల రూ.50 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు స్థానిక కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేపట్టారు. కబ్జాలను నిర్ధారించుకున్న అనంతరం మంగళవారం 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను జేసీబీలతో తొలగించారు. చెరువు స్థలంగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ పనులు మొదలుపెట్టారు.  

కొద్దికొద్దిగా మట్టితో నింపుతూ కబ్జా
అయితే, ఎఫ్‌‌‌‌టీఎల్ పరిధిలో ఆక్రమించిన స్థలం తనదంటూ ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు క్లెయిం చేస్తున్నట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్​తో ప్రతి నెల రూ.50 లక్షల వరకు అద్దెలు వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు.

భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే సదరు ప్రజాప్రతినిధి అక్కడ పార్కింగ్ దందా చేస్తూ నెమ్మదిగా మట్టిని నింపుకుంటూ ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఆక్రమించేసినట్లు తెలిపారు. ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశాల్యాన్ని నిర్ధారిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.