మాదాపూర్‌‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్.. ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్

మాదాపూర్‌‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్.. ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు : మాదాపూర్‌‌లో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌ పరిధిలో 2 ఎకరాలకి  పైగా ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురికాగా, రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్‌‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు పలుమార్లు ప్రయత్నించగా అడ్డుకున్నామని, అయినా, ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

 కోర్టుల ద్వారా కూడా ఇబ్బందులు పెట్టాలని చూశారని, అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తాజాగా రెండు ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలం చుట్టూ రేకులతో ఫెన్సింగ్‌‌ ఏర్పాటు చేయగా, హైడ్రాను ఆశ్రయించామన్నారు. దీంతో గురువారం  హైడ్రా ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన రేకులను తొలగించి ఫెన్సింగ్‌‌ తో పాటు హెచ్చరిక బోర్డులను   ఏర్పాటు చేసింది.