కుంట్లూరు గుడిసెల వద్ద హైడ్రామా

 కుంట్లూరు గుడిసెల వద్ద హైడ్రామా
  •     కూల్చేందుకు సిద్ధమైన రెవెన్యూ అధికారులు
  •      రాత్రంతా కాపాలా కాసిన వందల మంది గుడిసె వాసులు
  •     జేసీబీలు రాకుండా చుట్టూ కంచె వేసి, ట్రెంచ్ కొట్టారు 

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అబ్దుల్లాపూర్​మెట్ మండలం కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీలో హైడ్రామా నెలకొంది. ఇక్కడి వేలాది గుడిసెలను కూల్చేందుకు రెవెన్యూ అధికారులు రెడీ అవడంతో, గుడిసె వాసులు అప్రమమత్తమయ్యారు. గురువారం అర్ధరాత్రి దాదాపు 50 జేసీబీలు, పోలీస్​ఫోర్స్​తో అధికారులు గుడిసెల వద్దకు వస్తున్నారని తెలిసి, వందల మంది గుడిసెవాసులు రాత్రంతా కాపలా కాశారు. జేసీబీలను రానివ్వకుండా ముందుగా ఆ ప్రాంతం చుట్టూ ముళ్ల కంచె వేశారు. రెండు, మూడు అడుగుల లోతున ట్రెంచ్​కొట్టారు.

అవసరమైతే అధికారులపై తిరగబడేందుకు కర్రలు, రాళ్లు చేతపట్టారు. సీపీఐ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఆ విషయం తెలుసుకున్న అధికారులు కూల్చివేతకు వెనక్కి తగ్గారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాలతో అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ రవీందర్ దత్తు, హయత్ నగర్ సీఐ రామకృష్ణ శుక్రవారం గుడిసెల ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే గుడిసెలు ఖాళీ చేయాలని అక్కడి వారిని హెచ్చరించారు. గుడిసెలు ఖాళీ చేసేందుకు 10 రోజులు గడువు ఇస్తున్నామని చెప్పి, అక్కడి నుండి వెళ్లిపోయారు.

కాగా కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215 నుంచి 224 వరకు ఉన్న భూధాన్ భూమిలో ఆరు నెలల కింద 8 వేల కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. అప్పటి నుంచి గుడిసెలు తొలగించాలని అధికారులు చెబుతున్నా.. స్థానికులు వినడం లేదు. తామంతా ఇండ్లు లేని నిరుపేదలమని, గుడిసెలు ఖాళీ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి శుక్రవారం మాట్లాడుతూ.. సీపీఐ ఆధ్వర్యంలో 8 వేల పేద కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయని చెప్పారు. భూదాన్ భూమిలో మాత్రమే పేదలు గుడిసెలు వేసుకున్నారని చెప్పారు.