
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను విధానాన్ని వదిలేసి ఆఫీసులకు తిరిగి రావాలని హైసియా, హాస్టల్స్ అసోసియేషన్, తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్కౌన్సిల్ రిక్వెస్ట్ చేశాయి . ఆఫీసులన్నీ కొవిడ్ ప్రొటొకాల్స్ ప్రకారమే పనిచేస్తున్నాయని తెలిపాయి. హైసియా ప్రెసిడెంట్ భరణి అరోల్ మాట్లాడుతూ ఐటీ ఎంప్లాయీస్ రాకపోవడం వల్ల ఈ సెక్టార్‌పై ఆధారపడే బిజినెస్‌లు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. ఉద్యోగులు ఆఫీసులకు వస్తేనే ఇవి నిలబడతాయని అన్నారు. ‘‘ప్రస్తుతం 15శాతం మంది ఉద్యోగులే ఆఫీసులకు వస్తున్నారు. ఇది జూలై 2022 నాటికి 60 శాతానికి చేరవచ్చు. చాలా ఐటీ అనుబంధ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ముఖ్యంగా హాస్టల్/వసతి పరిశ్రమపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఐటీ రంగంపై ఆధారపడిన అనేక వ్యాపారాలు మూతపడుతున్నాయి ” అని ఆయన రిక్వెస్ట్ చేశారు. రహేజా ఐటీ పార్క్ హెడ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం ఆఫీసుల్లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎస్కలేటర్లు/లిఫ్ట్‌లు కూడా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పనిచేస్తాయని, ఆఫీసులు/వర్క్ స్టేషన్/కెఫెటేరియాల్లో సామాజిక దూరం పాటించేలా మార్చామని వివరించారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ట్రెజరర్ వెల్లంపల్లి మహీధర్ మాట్లాడుతూ తమ అసోసియేషన్‌లో 3500 హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో 2000 హైటెక్ సిటీ, గచ్చిబౌలి కొండాపూర్‌లో ఉన్నాయని చెప్పారు. గత రెండేళ్లలో 20శాతం హాస్టళ్లు మూతపడ్డాయని, 30 శాతం మంది ఓనర్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వివరించారు. మహమ్మారి కారణంగా డైరెక్ట్‌గా ఇన్‌డైరెక్ట్‌గా లక్ష మంది నష్టపోయారని అన్నారు. హాస్టళ్లను, తదితర ఐటీ ఆధారిత బిజినెస్‌లను కాపాడేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లందరూ ఆఫీసుకులకు రావాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.