- ఢిల్లీలో జరిగిన యూఎస్ ఈవెంట్లో ఫోన్ కాల్
న్యూఢిల్లీ: అమెరికాకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారీ మార్కెట్ ఉన్నాయని.. తమ నుంచి భారత్ ఏం కోరినా, అది వారికి దక్కుతుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘మనం భారతదేశానికి ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉన్నాం. భారతదేశం నాపై, మన దేశంపై 100 శాతం నమ్మకం ఉంచవచ్చు.
వారికి ఏదైనా సహాయం కావాలంటే, ఎక్కడికి కాల్ చేయాలో వారికి తెలుసు. వారు నేరుగా ఇక్కడికే కాల్ చేస్తారు. మనం బాగా రాణిస్తున్నాం. మనం రికార్డులను సృష్టిస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 250వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన వేడుకల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆయనకు తాను పెద్ద అభిమానిని అని అన్నారు. ‘ప్రతీ ఒక్కరికీ హలో.. నాకు ప్రధానమంత్రి మోదీ అంటే ఇష్టం. ఆయన గొప్పవాడు. నా స్నేహితుడు’ అని చెప్పారు. ‘రూబియో అమెరికా చరిత్రలోనే గొప్ప విదేశాంగ మంత్రిగా నిలుస్తారు. మీకు మార్కో, సెర్గియో ఉన్నప్పుడు.. మీరు పెద్ద విషయాలనే సాధిస్తున్నారు’ అని అన్నారు. ‘మీరు (రూబియో, సెర్గియో) మాకు బాగా ప్రాతినిధ్యం వహిస్తారని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రాన్ని ఆస్వాదించండి. ప్రధాని మోదీకి హలో చెప్పడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నేను ఆయనకు పెద్ద అభిమానినని ఆయనకు తెలియజేయండి’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, వైట్‌హౌస్‌ను సందర్శించాలంటూ ప్రధాని మోదీకి ట్రంప్ తరఫున సెర్గియో శనివారం ఆహ్వానం అందించారు.
