కేసీఆర్ పాద పద్మాలను తాకడం నా అదృష్టం : డీహెచ్ శ్రీనివాస్​రావు

కేసీఆర్ పాద పద్మాలను తాకడం నా అదృష్టం : డీహెచ్ శ్రీనివాస్​రావు
  • మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినందుకే మొక్కినట్లు వివరణ
  • కృతజ్ఞతగా చేసిన పనికి ఇంత రాద్ధాంతం అవసరమా అని ప్రశ్న 
  • కేసీఆర్ తెలంగాణ బాపు అని కామెంట్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కానని కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన కాళ్లు ఒక్కసారి కాదు వందసార్లయినా మొక్కుతా’’ అని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. కొత్తగూడెం పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం మున్నూరుకాపు కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి రెండేండ్ల కిందట సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన సమావేశంలో నేను కూడా ఉన్నా. దశలవారీగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. తొలి దశలో కొత్తగూడెం లేకపోతే.. నేను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిక్వెస్ట్ చేశా. కొత్తగూడెం వెనుకబడి ఉందని, తొలిదశలోనే అక్కడ కాలేజీ ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలో కాలేజీ ఏర్పాటైంది. ఆ కృతజ్ఞతతో సీఎం పాద పద్మాలకు నమస్కరించా. కృతజ్ఞతగా చేసిన పనికి ఇంత రాద్ధాంతం అవసరమా?” అని ప్రశ్నించారు. తాను మెడిసిన్ చదువుకోవడానికి సొంతూరుని వదిలి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నానని డీహెచ్ అన్నారు. విద్యార్థులకు ఆ బాధ లేకుండా కొత్తగూడెంలోనే అన్ని రకాల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మెడికల్ కాలేజీ కూడా రావడం చాలా గొప్ప విషయమని, ఈ క్రమంలో తాను ఉద్వేగానికి గురై సీఎం కాళ్లకు నమస్కరించానన్నారు. ‘‘కేసీఆర్ తెలంగాణ బాపు.. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపిత.. ఆయన నాకు తండ్రి సమానులు. ఆయనతో ఫొటో దిగడం, ఆయన పాదాలను తాకడంలో తప్పేమీ లేదు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా” అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ఎంతో కృషి చేస్తున్నారని, అందులో తనకూ భాగస్వామ్యం దక్కినందుకు సంతో షంగా ఉందన్నారు.

ఆ చిట్టీలో ఉన్నదేంటి?

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాను ఇచ్చిన చిట్టీ విషయాన్ని డీహెచ్ ప్రస్తావించారు. తాను ఒక డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు హెచ్‌‌‌‌‌‌‌‌వోడీగా ఉన్నానని, అందరి ముందు అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి చిట్టీ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. చిట్టీ ఇవ్వడాన్ని కూడా కొంత మంది తప్పు పడుతున్నారని చెప్పారు. చిట్టీలు ఇస్తేనో, కాళ్లు మొక్కితేనో ఎమ్మెల్యే అయిపోరని, అలా అయ్యేట్టు ఉంటే లైన్లు కట్టి మరీ కేసీఆర్ కాళ్లకు మొక్కేందుకు వేల మంది సిద్ధంగా ఉన్నారని డీహెచ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఎవరు ఏం అవుతారో కాలం నిర్ణయిస్తుందన్నారు.