ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం: మమతా బెనర్జీ

ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం: మమతా బెనర్జీ

ఆర్‌జి కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హ‌త్యాచార ఘ‌ట‌న‌ను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. విధులకు హాజరవ్వాలని దేశ అత్యన్నత న్యాయస్థానం హెచ్చరించినప్పటికీ, వారు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేరుస్తేనే విధుల్లో చేరుతామని చెప్తున్నారు. దీనిపై చర్చలు జరిపేందుకు వైద్యుల బృందాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆహ్వానించగా.. వారు చర్చలకు రాలేదు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు.. హత్య ఆస్పత్రిలో అనుమానాస్పద బ్యాగ్

ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదని, ఆర్జీ కర్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం కావాలని, న్యాయం జరగడం గురించి మాత్రమే తాను ఆందోళన చెందుతున్నానని తెలిపారు. వైద్యులు చర్చలకు వస్తారని తాను దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదని దీదీ అన్నారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. 

లైవ్ టెలికాస్ట్

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్లు 15 మందితో కాకుండా 30 మందితో సమావేశంలో పాల్గొనాలన్న తమ అసలు డిమాండ్‌కు కట్టుబడి ఉంటామని వైద్యాధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన చర్చల లైవ్ స్ట్రీమ్‌కు వెనక్కి తగ్గేది లేదని నొక్కి చెప్పారు. 

కాగా వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఇటీవల కాలంలో సకాలంలో వైద్యం అందక 27 మంది రోగులు మృతి చెందారు.