సరైన నేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది: రిషి సునాక్‌

సరైన నేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది: రిషి సునాక్‌

బ్రిటన్ దేశ ప్రధాని పదవికి జరుగబోయే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా పోటీ పడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ ఆర్ధిక వ్యవస్ధలో చిక్కుకుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేగాకుండా దేశం పలు సమస్యలను ఎదుర్కొంటోందని ఈ సమయంలో సరైన నేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆర్థిక, ఇతర సమస్యలను ఎదుర్కొనడానికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు.

గతంలో తనకు ఎన్నో పదవుల్లో కొనసాగిన అనుభవం ఉందన్నారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాను ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ స్ధానానికి పోటీలో ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రధాని పదవి బరిలో నిలిచేందుకు 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు అవసరం. అంతకంటే ఎక్కువ ఎంపీల మద్దతు సునాక్ కు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ కు 45 మంది ఎంపీల  బలం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగతా సభ్యుల మద్దతు కోసం ఆయన  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.